మహబూబ్నగర్ : జిల్లాలోని మన్యంకొండలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తామని క్రీడలు సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన శాంతా నారాయణ గౌడ్ మెమోరియల్ ప్రీమియర్ లీగ్ ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి నియోజకవర్గానికి క్రీడా మైదానాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహబూబ్నగర్లో రూ. 9కోట్లతో నూతన ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నాం. బాయ్స్ కాలేజీలో వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్ యోగా షెడ్డు ఏర్పాటు చేయించామని మంత్రి తెలిపారు.
త్వరలోనే క్రీడా పాలసీని రూపొందిస్తామన్నారు. అలాగే హన్వాడలో 500 కోట్లతో పుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని, పట్టణం చుట్టూతా అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడంతో పట్టణ ప్రతిష్ట మరింత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. వైద్య చికిత్స కోసం విదేశాల నుంచి సైతం రోగులు పాలమూరుకు వచ్చే విధంగా అభివృద్ధి పరుస్తామన్నారు.
మంచి చేస్తుంటే అడ్డుకునే వాళ్లు కచ్చితంగా ఉంటారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సూర్యుడిపై దుమ్మెస్తే అది వేసిన వారిపైనే పడుతుందని గ్రహించాలన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరు ఆర్థిక కారణాలతో ప్రాణాలు కోల్పోకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చికిత్స చేయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.