హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్లో భాగంగా ఎగిరిన హాట్ ఎయిర్బెలూన్కు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్తున్న ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటకశాఖ అజాగ్రత్త, అనుభవరాహిత్యంతో సందర్శకుల ప్రాణాలతో చెలగాటమాడాయని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే గచ్చిబౌలి ప్రాంతంలో చెరువు సమీపంలో హాట్ ఎయిర్‌బెలూన్ ల్యాండ్ అయిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. బెలూన్‌లో ప్రయాణించిన వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారని, త్రుటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపంగా మారాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. హాట్ ఎయిర్‌బెలూన్ శనివారం ఉదయం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న బెలూన్లతోనే వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.