ఎన్నికలకు ముందు రైతాంగానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, రూ. 2లక్షల లోపు రుణమాఫీ చేయాలని ఏఐపీకేఎస్(అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం), రైతు సంఘం, సీపీఐ, ఏఐకేఎస్, అనుబంధ తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట, బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులు బైఠాయించారు. ఈ సందర్భంగా పల్లయ్య మాట్లాడుతూ.. పది నెలల నుంచి సీఎం రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. రేవంత్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.