హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళిక రూపొందించింది. సాగుకు రూ.921.40 కోట్లు, డ్రిప్ కోసం రూ.942.50 కోట్లు పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక రూపాయికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేరొంది. వర్సిటీ రూపొందించిన రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ.1,341 కోట్ల ఉత్పత్తి విలువను సాధించవచ్చని ఉద్యాన విశ్వవిద్యాలయం అంచనా వేసింది. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆవిషరించారు.
ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2030వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్దేశించారు. వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా కార్యాచరణను అమలుచేయాలని నిర్ణయించారు. మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు గుర్తించి, వాటికి అనుగుణంగా విస్తీర్ణం పెంచాలని విశ్వవిద్యాలయం సూచించింది. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డి.రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ డీ రాజిరెడ్డి, డాక్టర్ ఏ భగవాన్, డాక్టర్ జీపీ సునందిని రూపొందించారు.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు రంగం బలోపేతంలో భాగంగా సోలార్ విద్యుత్తు ఉత్పత్తి, వినియోగంపై ఆసక్తిగా ఉన్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. గురువారం సచివాలయంలో సోలార్ విద్యుత్తుపై జర్మనీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో 29లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం జర్మనీ ప్రతినిధులకు వివరించారు.
వాటికి సోలార్ విద్యుత్తు అందించాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంచేశారు. జర్మనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. సోలార్ రంగంపై ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి మేరకు పలు ప్రతిపాదనలతో వచ్చినట్టు చెప్పారు. జర్మనీ ప్రతినిధుల ప్రతిపాదనలపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించాలని విద్యుత్తుశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ను ఆదేశించారు.