హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లో ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ సర్కార్ మూడు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రూపొందించగా.. వాటిని రద్దు చేయాలని సాగిన రైతుల ఐక్య పోరాటం చరిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. ఈ పోరాటంలో ఏఐకేఎస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. మోదీ పాలనలో రైతుల ఆదాయం అసంఘటిత రంగకార్మికుల కంటే తగ్గిందని ఆవేదన వ్యక్తంచేశారు.