హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): దేశాన్ని పట్టిపీడిస్తున్న మధుమేహ మహమ్మారిని నిర్మూలించేందుకే డయాబెటిక్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో ఆయన పలువురు వైద్యనిపుణులతో కలిసి డయాబెటిక్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ రోగుల్లో భారత్ ముందంజలో ఉన్నదని తెలిపారు. ఈ మధుమేహ సమస్యలను భారతీయ దృక్కోణంలో పరిశోధించడానికి ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్ర అవసరాన్ని గుర్తించామని చెప్పారు. ఆసియాలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన ఈ పరిశోధనా కేంద్రం ద్వారా డయాబెటిస్ అవసమైన నూతన చికిత్సా పద్ధతులకు కొత్త మార్గదర్శకాలు కనుగొనేందుకు కృషి చేస్తామని డాక్టర్ రెడ్డి వివరించారు.