Cabinet Expansion | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ):మంత్రివర్గ విస్తరణ వేళ అన్యూహ్య పరిణామాలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదించిన తుదిజాబితాలోని పేర్ల పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది. వ్యక్తులకు కాకుండా సామాజికవర్గాల పరంగా పాధాన్యత ఇవ్వాలని తాను చేసిన సూచనను పట్టించుకోకుండా తుది జాబితా పట్టుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు గురువారం పార్లమెంటులో పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. అక్కడే మంత్రివర్గ కూర్పుపై చర్చ జరిగినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమర్పించిన జాబితాను రాహుల్ ఓకే చేసి ఉంటే ఈ నెల 7న ప్రమాణ స్వీకారణ ఉండేదని, కానీ జాబితాను రాహుల్ నిర్దంద్వంగా తోసిపుచ్చడంతో విస్తరణ మరింత అలస్యం కానుందని కాంగ్రెస్ వర్గాలు చెస్తున్నాయి.
గాంధీభవన్ నుంచి మీడియాకు లీక్ ఇచ్చిన ఇద్దరి పేర్లను ఏఐసీసీ పక్కన పెట్టినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ పేర్లు ఖరారైనట్టు పది రోజులుగా కాంగ్రెస్ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కానీ రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పేర్లు ప్రచారంలోకి రావడంపై రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది. మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే తగిన ప్రాతినిధ్యం ఉందని, మళ్లీ ఇద్దరిని కొత్తగా తీసుకోవాలన్న ప్రతిపాదన ఎందుకని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నిలదీసినట్టు తెలిసింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉండగా మళ్లీ ఆయన సోదరుడికి అవకాశం ఇవ్వాలని కోరడమేంటని మండిపడ్డారని సమాచారం. పార్టీలో చేరినప్పుడే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. అయితే వెంకట్‌రెడ్డిని పక్కనపెట్టి రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వండని రాహుల్ స్పష్టంచేసినట్టు తెలుస్తున్నది. వ్యక్తుల కంటే సామాజిక సమీకరణలకే ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చిచెప్పినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
ప్రతిపాదిత జాబితాలో బీసీ సామాజికవర్గం నుంచి ఎంత మందికి అవకాశమిచ్చారని రాహుల్ గాంధీ అడగగా.. ఇప్పటికే ఇద్దరు మంత్రుల ప్రాతినిధ్యం ఉందని, మరో బెర్తు కోసం ప్రతిపాదనలు పంపామని మహేశ్‌కుమార్‌గౌడ్ వివరించినట్టు తెలిసింది. ఒక్కరికి కాదు మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలంటూ రాహుల్ సూచించినట్టు సమాచారం. దీంతో మంత్రివర్గ విస్తరణ వేళ ఊహించని విధంగా కొత్త సమీకరణలు మొదలయ్యాయి. ఇప్పటికే వాకిటి శ్రీహరి పేరు ప్రచారంలో ఉండగా, తాజాగా ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, విజయశాంతి పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతున్నది. తొందరపాటు నిర్ణయాలు వద్దని, తాము చర్చించి నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూచించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉగాది రోజున కానీ, ఏప్రిల్ 3న కానీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు ముహుర్తాలు కూడా దాటిపోవడం వల్లనే తప్పని పరిస్థితుల్లో మహేశ్‌కుమార్‌గౌడ్ గురువారం ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చారని తెలుస్తున్నది. మంత్రివర్గ కూర్పులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అవి తొలిగిపోయాక అధినాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని మీడియాకు వివరించారు.
మంత్రివర్గ విస్తరణలో మైనారిటీ కోటాలో ముస్లిం వ్యక్తికి కచ్చితంగా అవకాశం కల్పించాలని రాహుల్ సూచించినట్టు తెలిసింది. ఆ వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఎవరూ లేరని, ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సియాసత్ పత్రిక అధినేత అమేర్ అలీఖాన్ ఒక్కరు మాత్రమే ఉన్నారని టీపీసీసీ చీఫ్ ఆయనకు వివరించగా.. అయితే ఆయనే ఇవ్వండి, మండలి ప్రాతినిధ్యం కూడా ఉంటుంది అని అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.