Meenakshi Natarajan | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రెండువేల ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన లీకులకు అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది. కంచ గచ్చిబౌలి భూములు తీవ్ర వివాదాస్పదంగా మారడంతో దానిపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దించింది. హైదరాబాద్‌కు శనివారం వచ్చిన మీనాక్షి నటరాజన్ హెచ్‌సీయూ భూము ల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రివర్గ కమిటీతో పాటు కాంగ్రెస్ అనుబంధ విద్యా ర్థి విభాగం ఎన్ఎస్యూఐ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నుంచి భూ వివాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలు ప్రభుత్వానివేనని, ఈ భూమిపై ప్రభుత్వానికే సర్వ హక్కులు ఉన్నాయని మంత్రులు ఆమెకు వివరించినట్టు తెలిసింది.
ఈ భూములతో యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదని వారు తేల్చి చెప్పినట్టు సమాచారం. అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాటం చేస్తున్నదని అన్నారు. గచ్చిబౌలి భూముల వివాదంపై ఏకపక్షంగా కాకుండా అందరి వాదనలు వింటామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎవరికీ నష్టం జరగకుండా వివాదం పరిషరించాలనేది తమ ఆలోచన అని.. వర్శిటీ విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని తెలిపారు. ఇప్పటివరకు పర్యావరణాన్ని కాపాడటానికి హెచ్‌సీయూ విద్యార్థులు తమ భవిష్యత్తునే పణంగా పెట్టి పోరాడారు. కానీ మంత్రుల కమిటీతో సమావేశం అనంతరం మాట్లాడిన మీనాక్షి విచిత్రంగా పర్యవరణాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పోరాడుతుందని ప్రకటించటంతో విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు.