కరీంనగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఏఐ టెక్నాలజీ వైద్యులకు చాలెంజ్‌గా మారబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నా రు. కరీంనగర్లో శనివారం జరిగిన చల్మెడ మెడికల్ కళాశాల స్నాతకోత్సవం లో ఆయన పాల్గొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన-2019 బ్యాచ్ మెడికల్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ డాక్టర్లు రోగులతో సరిగ్గా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందని, ఇది సైకలాజికల్ ఎఫెక్ట్ అని అన్నారు. రాబో యే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపంలో డాక్టర్లకు పెద్ద సవాల్ ఎదురవబోతున్నదని చెప్పారు. చాట్ జీపీటీ, గ్రోక్‌లు ప్రిస్క్రిప్షన్లు కూడా రాస్తున్నాయని, ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలామంది రోగులు డాక్టర్ల వద్దకు వస్తున్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. ఇలాంటి రోగులను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
కరుణ, దయ, సానుభూతితో రోగులకు వైద్యులు సేవలు అందించాలని కోరారు. వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో వైద్యులందరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తిచేశారు. పిల్లలు 8, 9వ తరగతి చదువుతున్నప్పుడే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారనే ఆకాంక్ష మొదలవుతుందని అన్నారు. డాక్టర్ కావాలంటే ఏడెనిమిదేండ్లు చదవాల్సి ఉంటుందని, ఇది మామూలు విషయం కాదని, ఇంత ఓపికతో చదువుతున్న మెడికోలకు అభినందనలు అని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మెడికల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పా టు చేశామని తెలిపారు. దేశంలో ఇలాం టి అవకాశాలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎంబీబీఎస్ పూర్తిచేసిన వైద్య విద్యార్థులకు అభినందనలు తెలిపారు. చల్మెడ మెడికల్ కళాశాలకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉన్నదని అన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ పూర్తిచేసిన మెడికోలు భవిష్యత్తులో మంచి వైద్యులుగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంబీబీఎస్ పూర్తిచేసిన 119 మంది విద్యార్థులకు కేటీఆర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, డైరెక్టర్ డాక్టర్ వీ సూర్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆసిం అలీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీ అనిత పాల్గొన్నారు.
నాకూ డాక్టర్ సీటు వచ్చింది!
‘నన్ను కూడా డాక్టర్‌ను చేయాలని మా అమ్మ కలలు కనేది. ఆమె కోరిక మేరకు నేను కర్నాటకలో కేసెట్ రాశాను. సీటు వచ్చింది. మా అమ్మ చాలా సంతోష పడ్డారు. కానీ మా నాన్న మాత్రం వేరేలా చెప్పారు. ఐదున్నరేండ్లు ఎంబీబీఎస్ చదవాలని ఆ తర్వాత పీజీ చదవాలని, ఆ తర్వాత స్పెషలైజేషన్ కూడా చేయాల్సి ఉంటుందని, వ్యక్తిగత జీవితం ఉండకుండా సేవ చేయాల్సి ఉంటుందని, అందుకు సిద్ధమేనా ఆలోచించుకోవాలని మా నాన్న చెప్పారు. నేను కూడా ఆలోచించి డిగ్రీలో వెళ్లి జాయిన్ అయ్యాను’ -కేటీఆర్