Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏఐ సిటీ ఫెసిలిటీ సెంటర్.. ఫోర్త్ అలియాస్ ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఏఐ సిటీ నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న సెంటర్. అంటే తాత్కాలిక కేంద్రమన్నమాట. ప్రభుత్వ పరంగా టీ-హబ్, టీ-వర్క్స్, ట్రిపుల్ ఐటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల చదరపు అడుగుల్లో విశాలమైన , అద్భుతమైన భవనాలు అందుబాటులో ఉండగా అసంపూర్తి అద్దె భవనంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఈ భవనంలో ఏఐ సిటీ ఫెసిలిటీ సెంటర్‌ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి రానున్న రోజుల్లో ఎంతో ప్రాధాన్యం ఉండనుందని కేసీఆర్ ప్రభుత్వం ఆదిలోనే గుర్తించింది. అందుకే హైదరాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ సమ్మిట్-2024 నిర్వహించేందుకు గతంలోనే చొరవ తీసుకుంది. కొన్నిరోజుల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏఐ ప్రాధాన్యత దృష్ట్యా ‘ఏఐ గ్లోబల్ సమ్మిట్-2024’ను నిర్వహించింది. ఈ క్రమంలోనే ఏఐ సిటీని ఏర్పాటు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సిటీ నిర్మాణం పూర్తయ్యే వరకు కార్యకలాపాలు, పురోగతి, ఇతరత్రా వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించేందుకు ఒక కేంద్రం కావాలి. అదే ఏఐ సిటీ ఫెసిలిటీ సెంటర్. దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు సమ్మిట్ వేదికగానే రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. కాకపోతే ఆ కేంద్రాన్ని శంషాబాద్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్)లోని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇదే అందరినీ విస్మయానికి గురి చేసింది.
దేశంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామంటూ జూన్ 2022 నగరానికి చెందిన కపిల్ గ్రూపు ఆర్భాటంగా ప్రకటించింది. శంషాబాద్ విమానాశ్రయం తూర్పు ముఖం దగ్గర శ్రీశైలం హైవేను అనుకొని 50-60 ఎకరాల్లో 12 అంతస్తులతో కూడిన భవనాన్ని నిర్మిస్తామని చెప్పింది. ఇందుకోసం సుమారు రూ.4 వేల కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్టు ప్రకటించింది. కారణాలు ఏవైనా ఆ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాలేదు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్ సహా మూడు అంతస్తులతో కూడిన రెండు టవర్ల నిర్మాణం మాత్రమే ఇప్పటికీ పురోగతిలో ఉంది. అంటే మూడేండ్ల కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం వేగంగా పనులు కొనసాగించినా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. ఇలాంటి అసంపూర్తి భవనాల్లో ఏఐ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
శంషాబాద్ విమానాశ్రయం తూర్పు వైపు నిర్మిస్తున్న డబ్ల్యూటీసీ శంషాబాద్ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని కంపెనీ చెప్తున్నది. అలాంటప్పుడు ఏడాది తర్వాత పూర్తయ్యే భవనంలో ఏఐ సిటీ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. ఆ మేరకు ఒప్పందం కూడా పూర్తయినట్టు తెలుస్తున్నది. అయితే, ఆ ఒప్పందంలో ఏముందనేది మాత్రం బయటికి రావడం లేదు. ఏడాదికి గాని పూర్తికాని భవనంలో తాత్కాలిక సెంటర్ ఏర్పాటు చేయాలనుకోవడం ఒక ఎత్తయితే, ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం తరఫున సదరు గ్రూపునకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు ఏమిటన్నవి తెలియరాలేదు. భవనం పూర్తయ్యాక సెంటర్ ఏర్పాటు చేస్తారా? లేదంటే భవనం పూర్తికి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా చేయూత అందిస్తారా? అసలు ఆ భవనాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ఇలా అనేక సందేహాలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ దేశంలోనే కాకుండా అంతర్జాతీయస్థాయిలో టెక్నాలజీ స్టార్టప్‌లకు కేంద్రంగా మారింది. ఐటీ కారిడార్‌లో అత్యంత విశాలమైన ప్రాంగణంలో ఉన్న టీ-హబ్‌లో రకరకాల టెక్నాలజీ స్టార్టప్‌లు ఉన్నాయి. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కి సంబంధించిన టెక్నాలజీ స్టార్టప్‌లే 60కి పైగా ఉన్నాయి. ఇక్కడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏఐ స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ప్రత్యేకంగా వ్యవస్థలు కూడా ఏర్పాటయ్యాయి. స్టార్టప్‌లకు, ఐటీ కంపెనీలకు ఎంతో అనుకూలంగా ఉండే ఏఐ ఫెసిలిటీ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా ఐటీ శాఖకే చెందిన భవనం కావడంతో పైసా ఖర్చు లేకుండా ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటవుతుంది. ఇదే కాకుండా టీ-వర్క్స్, ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో అనేక భవనాలు కూడా ఉన్నాయి. సర్కారు మనసు పెడితే రెండు లక్షల చదరపు అడుగులు అనేది అత్యంత సులువైన ప్రక్రియ. కానీ వీటిని కాదని ప్రైవేటు సంస్థకు చెందిన భవనంలోనే ఏర్పాటు చేయడం వెనక మర్మమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశమేమంటే, ఏఐ సిటీ 200 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. ప్రస్తుతం నిర్మాణ రంగంలోని పరిజ్ఞానం, వనరుల దృష్ట్యా రెండు లక్షల చదరపు అడుగుల్లో ఒక భవనాన్ని నిర్మించడమనేది అత్యంత సులువైన ప్రక్రియ. ఈ క్రమంలో అక్కడే ఒక తాత్కాలిక భవనాన్ని నిర్మించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఏఐ సిటీ పూర్తయిన తర్వాత ఈ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసిన భవనాన్ని కూడా వినియోగించుకోవచ్చు. అయినప్పటికీ అసంపూర్తి, ప్రైవేటు భవనాన్ని ఎంచుకోవడం వెనక అసలు ఉద్దేశం వేరే ఉందన్న చర్చ జరుగుతున్నది.