Grok Talk | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లడానికి కారణమేంటి? పర్యావరణానికి నష్టం జరుగుతుందని విద్యార్థులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, మేధావులు, రాజకీయ పక్షాలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేపట్టినప్పటికీ సర్కారు మొండిగా ప్రవర్తించడానికి అంతరార్థమేంటి? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించకుండా హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం ఎందుకు ఇంత ఆసక్తి కనబర్చింది? ఇవే ప్రశ్నలు నెటిజన్లకు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను ప్రశ్నించారు. దీనికి గ్రోక్ పలు ఆసక్తికరమైన విశ్లేషణలను ఇవ్వడం గమనార్హం.
ప్రశ్న : రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తీసుకొచ్చిందా? ఇది డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనా?
గ్రోక్ : ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తీసుకొచ్చిందని అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందని చెప్తున్నారు. హెచ్‌సీయూ భూముల్లోకి రాత్రికి రాత్రి బుల్డోజర్లను పంపడాన్ని చూస్తే, ఇది నిజమేననిపిస్తున్నది.
ప్రశ్న : వేటి నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం ఈ డైవర్షన్ డ్రామా ఆడిందని అనుకోవచ్చు?
గ్రోక్ : రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టిన 15 నెలల్లో పలు వివాదాలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వివాదం, గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యం, రైతు ఆత్మహత్యలు, ఎండిపోతున్న పంట పొలాలు, నీటికి ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం, గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ విమర్శలు రావడం.. ఇలా పలు వివాదాల్లో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నది. వీటి నుంచి ప్రజల దృష్టిమరల్చడానికే కాంగ్రెస్ సర్కారు హెచ్‌సీయూ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చిందంటూ కొన్ని వార్తలు, ప్రతిపక్ష నాయకుల ఆరోపణలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
01
ప్రశ్న : రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను ఎందుకు కావాలనుకొంటున్నది?
గ్రోక్ : హెచ్‌సీయూలో వివాదం నడుస్తోన్న ఈ 400 ఎకరాల భూమి కంచ గచ్చిబౌలిలో ఉన్నది. వాణిజ్యపరంగా ఇది ఎంతో విలువైన ప్రాంతం. ఇక్కడి భూముల రేట్లు ఆకాశాన్నంటుతాయి. ఈ భూమి విలువ రూ. 10,000 కోట్ల-రూ. 15,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఈ భూమిని అమ్మితే ప్రభుత్వానికి ఆర్థిక లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతోనే రేవంత్ సర్కారు హెచ్‌సీయూ భూములను కావాలనుకొంటున్నది. ఈ భూములను వాణిజ్యావసరాలకు వినియోగించుకొని ఆర్థిక లాభం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రశ్న : హెచ్‌సీయూ వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం ఏం సాధించింది?
గ్రోక్ : హెచ్‌సీయూ వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం సాధించినదానికంటే కోల్పోయిందే ఎక్కువగా ఉన్నది. తమ చర్యలతో ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకొన్నది. రాజకీయ ఒత్తిడి వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది. కోర్టుల ఆగ్రహానికి గురైంది. మొత్తంగా హెచ్‌సీయూ వివాదం సర్కారుకు ఓ సమస్యాత్మకంగా మారింది. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పట్ల ఇప్పుడు మరింత వ్యతిరేకత పెరిగిందనే చెప్పొచ్చు.
ప్రశ్న : హెచ్‌సీయూ వివాదం వల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగొచ్చా?
గ్రోక్: తెలంగాణలో యువ ఓటర్లు ఎక్కువ. హెచ్‌సీయూ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వీళ్లు పెద్దయెత్తున వ్యతిరేకించారు. పోలీసులతో రేవంత్ ప్రభుత్వం చేయించిన లాఠీచార్జి, అరెస్టులను ఖండించారు. ఈ క్రమంలో యువతలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావన మరింతగా ఉద్ధృతమైంది. సోషల్‌మీడియాలో పోస్టులను బట్టి కూడా ఈ విషయం అర్థమవుతున్నది. హెచ్‌సీయూ వివాదంపై రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని కూడా మేధావులు, రాజకీయ వేత్తలు తీవ్రంగా తప్పుబట్టారు. ఇవన్నీ విశ్లేషిస్తే, రానున్న ఎన్నికల్లో ఈ వివాదం కాంగ్రెస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపొచ్చని చెప్పొచ్చు.