హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సేవలను వినియోగించాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ఏఐ ఆధారిత స్కాన్ ద్వారా హై రిజల్యూషన్ ఇమేజింగ్, కచ్చితమైన ఫలితాలు సాధించాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ స్కాన్‌లో క్యాన్సర్ లక్షణాలను గుర్తించిన తర్వాత ఆ ఫలితాలను నిపుణులైన వైద్యులు, ఆంకాలజిస్టులకు పంపి వ్యాధి నిర్ధారణ చేయనున్నారు.
ఇందుకుగాను పైలట్ ప్రాజెక్టులో వచ్చిన ఫలితాలను బట్టి రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ఈ అధునాతన సాంకేతికతను తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియ ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో కొనసాగుతున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం డే కేర్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. నోరు, రొమ్ము(బ్రెస్ట్ క్యాన్సర్), గర్భాశయ క్యాన్సర్లను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల నిర్ధారణలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించడానికి ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్, విధానాలపై మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్న రోగులను తదుపరి నిర్ధారణ, చికిత్స కోసం ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానతోపాటు నిమ్స్‌కు రిఫర్ చేయనున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, ఆదిలాబాద్‌లలో కీమోథెరపీని అందుబాటులోకి తేనున్నారు.
తద్వారా పేదలకు మరింత సేవలందించేలా చర్యలు చేపట్టనున్నారు. ఆరోగ్యశాఖలో ఏఐని విస్తృతంగా వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తున్నందున ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో రేడియాలాజిస్ట్ల కొరత ఉండటంతో ఏఐ ఆధారిత సాధనాలు వినియోగించుకోవడం ద్వారా ఈ లోటును భర్తీ చేయాలని భావిస్తున్నది.