హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలుకు అవసరమైన పరికరాల కోసం ఆగ్రోస్ సంస్థ పిలిచిన టెండర్ల వ్యవహారంలో అరాచకపర్వం వెలుగుచూసింది. టెండర్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి టెండర్ బాక్స్ సీల్‌ను కూడా తొలగించి, తన మనుషుల చేత టెండర్లు వేయించి, మళ్లీ సీల్ వేయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఒక రాజకీయ నేత హస్తం ఉన్నట్టు, ఆయన కనుసన్నల్లోనే ఈ తతంగం జరిగినట్టు తెలుస్తున్నది. యాసంగి ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో టార్పాలిన్స్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్లు, కాలిపర్స్ తదితర పరికరాల కొనుగోలు కోసం ఆగ్రోస్ సంస్థ టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లను దక్కించుకునేందుకు సదరు రాజకీయ నేత చక్రం తిప్పినట్టు తెలిసింది. తనకు సంబంధించిన వారి ద్వారా కొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని, వారితో టెండర్లు వేయించినట్టు తెలిసింది. టెండర్ దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఇచ్చారు.
నిర్దేశిత గడువులోగా పలువురు బిడ్డర్లు తమ దరఖాస్తులను టెండర్ బాక్స్‌లో వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సమయం ముగిసిన వెంటనే నిబంధనల ప్రకారం అధికారులు బాక్స్‌కు సీల్ వేశారు. అయితే, సదరు రాజకీయ నేతకు సంబంధించిన ఒక బిడ్డర్ గడువు ముగిసిన తరువాత 3:35 గంటలకు టెండర్ దాఖలు చేసేందుకు వచ్చారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయం దాటిన తరువాత దరఖాస్తులను స్వీకరించకూడదు. కానీ, ఆ బిడ్డర్ కోసం ఒక ఆయా చేత టెండర్ బాక్స్ సీల్‌ను తొలగించి, ఆ బిడ్డర్ తెచ్చిన దరఖాస్తును అందులో వేయించినట్టు తెలుస్తున్నది. ఆ తరువాత యథాప్రకారం టెండర్ బాక్స్‌కు సీల్ వేయించారు. ఇందుకు సంబంధించి 3:36 నిమిషాలకు ఆమె టెండర్ బాక్స్‌లో దరఖాస్తులు వేస్తున్న ఫొటో, వీడియో ‘నమస్తే తెలంగాణ’కు చిక్కింది. దీనిపై పలువురు బిడ్డర్లు అక్కడే అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అంతేకాకుండా, ఆగ్రోస్ సంస్థ చైర్మన్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. దీనిపై చర్యలు తీసుకోవాలని బిడ్డర్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. సదరు నేత అరాచకాలపై ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.