వ్యవసాయ యూనివర్సిటీ, మే 11: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (Agriculture University) రానున్న విద్యా సంవత్సరం కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులర్గా ఉన్న బీఎస్సీ (అగ్రికల్చర్), కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులకు అదనంగా ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం డబ్ల్యూఎస్యూతో కలసి నాలుగేండ్ల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సు ప్రారంభించనున్నామని వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య అన్నారు. విద్యార్థులు 4 సంవత్సరాల కోర్సు వ్యవధిలో మూడేండ్ల పీజేటీఏయూలోనూ, ఒక ఏడాది వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయంలోనూ విద్య అభ్యసిస్తారని వెల్లడించారు.
రెండు విశ్వవిద్యాలయాల్లోనూ విద్యనభ్యసించే అవకాశం విద్యార్థులకి కలుగుతుందని చెప్పారు. విద్యార్థులు కూడా చదవాలని భావిస్తే మరో ఏడాది వెస్టర్న్ సిడ్నీ వర్సిటీలో చదవాల్సి ఉంటుంది. తద్వారా బీఎస్సీ డిగ్రీ పీజేటీఏయూ నుంచి, ఎంఎస్సీ డిగ్రీ వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం నుంచి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు పీజీ తర్వాత కూడా వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ కూడా చేయాలనుకుంటే ఎలాంటి రుసుములు లేకుండా స్కాలర్ షిప్ సాయంతో పీహెచ్డీ పూర్తి చేయవచ్చు. ఈ అంశాలపై రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఒప్పందం కుదిరే ప్రక్రియ తుది దశలో ఉందని వెల్లడించారు. వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం అందించే అన్ని వ్యవసాయ కోర్సులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపు ఉందని చెప్పారు. ఐసీఏఆర్డబ్ల్యూఎస్యూల మధ్య గతేడాది ఒక ఒప్పందం కూడా కుదిరిందని వివరించారు.
ఈ ప్రత్యేక కోర్సుల ప్రవేశాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల అప్సెట్ ఫలితాలలో పాస్ అయి ర్యాంకులు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. పీజేటీఏయూ లో రెగ్యులర్, ప్రత్యేక కోటా సీట్లని పెంచడం తో పాటు, ఫీజులు కూడా తగ్గించామన్నారు. కొత్త కళాశాలలు కూడా రానున్నాయన్నారు.ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్ఐఆర్ కోటా ప్రవేశాలకు ఈ వారంలోనే నోటిఫికేషన్ రానుందని చెప్పారు. గుర్తింపు, అనుమతి లేని చాలా ప్రైవేటు సంస్థలు బీఎస్సీ కోర్సులలో ప్రవేశాలకు తప్పుడు నోటిఫికేషన్ మోసపోవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో బీఎస్సీ (అగ్రికల్చర్) విద్య కోర్సు అందించేందుకు ఐసీఏఆర్ గుర్తింపు, అనుమతి ఒక్క పీజే టీఏయూకి మాత్రమే ఉన్నాయని విద్యార్థులు, తల్లి తండ్రులు గుర్తించాలని వీసీ జానయ్య వివరించారు.