బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సాఘించింది. 2014-15లో 12వ స్థానంలో ఉండగా 2020-21లో ఏకంగా నాలుగో స్థానానికి చేరింది. గతంలో 44.40 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా 2020-21లో 1.02 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది. 2020-21లో పశ్చిమబెంగాల్ 1.65 కోట్ల టన్నులు, ఉత్తరప్రదేశ్ 1.55 కోట్ల టన్నులు, పంజాబ్ 1.27 కోట్ల టన్నులు ఉత్పత్తి చేయగా తెలంగాణ 1.02 కోట్ల టన్నులు ఉత్పత్తి చేసింది.
హైదరాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి అద్భుతంగా ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రశంసలు కురిపించింది. 2014-15 సంవత్సరం నుంచి 2020-21 వరకు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. తద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగినట్టు తెలిపింది. గతంతో పోల్చితే ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు 90 శాతం పెరగగా, బియ్యం ఉత్పత్తి 120 శాతానికి పెరిగినట్టు వివరించింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయాభివృద్ధి చర్యలతో సాగు విస్తీర్ణం 64.54 లక్షల ఎకరాల నుంచి 1.02 కోట్ల ఎకరాలకు పెరిగినట్టు పేర్కొన్నది.
రాష్ట్రంలో ఎరువుల వాడకం భారీగా తగ్గినట్టు ఆర్బీఐ తెలిపింది. రాష్ట్రంలో ఎన్పీకే ఎరువుల వినియోగం 2014-15లో హెక్టారుకు 231.4 కేజీలు ఉండగా 2020-21లో 200.53 కేజీలకు తగ్గింది.
మాంసం, పాల ఉత్పత్తిలో సత్తాచాటిన తెలంగాణ
వ్వయసాయ ఉత్పత్తులతో పాటు అనుబంధ రంగాలైన మాంసం, పాలు, గుడ్ల ఉత్పత్తి పెరుగుదలలోనూ తెలంగాణ సత్తా చాటినట్టు ఆర్బీఐ వెల్లడించింది. మాంసం ఉత్పత్తి 2014-15లో 5.05 లక్షల టన్నులు కాగా 2020-21లో 9.20 టన్నులకు పెరిగింది. అదే విధంగా పాల ఉత్పత్తి 2014-15లో 42.07 లక్షల టన్నులు కాగా 2020-21లో 57.65 లక్షల టన్నులకు పెరిగింది. దీంతో పాటు గుడ్ల ఉత్పత్తి 2014-15లో 1061.85 కోట్లు కాగా 2020-21లో 1584.70 కోట్లకు పెరిగింది.
మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి
మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనూ తెలంగాణ సత్తా చాటింది. 2014-15లో కేవలం 71.14 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగా 2020-21లో అది 1.27 కోట్ల టన్నులకు పెరిగింది. దీంతో పాటు పప్పుల ఉత్పత్తిలోనూ చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. 2014-15లో 2.63 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగా 2020-21లో 5.89 లక్షల టన్నులు ఉత్పత్తి చేసింది.
పత్తి ఉత్పత్తిలోనూ ముందంజ
పత్తి ఉత్పత్తి, విస్తీర్ణం పెంపులోనూ తెలంగాణ సత్తా చాటింది. 2014-15లో 38 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి చేయగా, 2020-21లో 57.97 లక్షల బేళ్లకు పెరిగింది. ఈ విధంగా ఆ ఏడాది పత్తి ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పత్తి సాగు విస్తీర్ణం 2014-15లో 17.13 లక్షల హెక్టార్ల నుంచి 23.58 హెక్టార్లకు పెరిగింది.
భారీగా పెరిగిన వరిసాగు విస్తీర్ణం
సీఎం కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ సంక్షేమ చర్యలు, పథకాల అమలుతో తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం భారీస్థాయిలో సుమారు 110 శాతం పెరగడం గమనార్హం. 2014-15లో 34.95 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా 2020-21లో అది 78.69 లక్షల ఎకరాలకు పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ విధంగా ఏడేండ్లలో ఏకంగా 43.74 లక్షల ఎకరాలు పెరగడం గమనార్హం. దీంతో వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానం నుంచి మూడో స్థానానికి ఎదిగింది.
మొత్తం ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం
రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం భారీగా పెరిగినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2014-15లో 64.54 లక్షల ఎకరాలు ఉండగా 2020-21లో అది 1.02 కోట్ల ఎకరాలకు పెరిగింది.