Rythu Bandhu | ఏడాదికి ఎకరానికి రూ.10వేల చొప్పున రైతులకు పెట్టుబడి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఈ సీజన్‌తో కలిపితే రైతుబంధు ద్వారా అందించిన మొత్తం రూ.72,910 కోట్లు. రైతుబంధుసాయం విడుదల చేసినందుకు రాష్ట్ర రైతాంగం తరఫున కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతుబంధు సంబురం మొదలైంది. సోమవారం నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నది. ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ తొలుత ఎకరం రైతులకు సాయం అందించనున్నది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో 1.54 కోట్ల ఎకరాలకుగానూ 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నుట్టు వెల్లడించారు. గతంతో పోల్చితే ఈ సీజన్లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా అందిస్తున్నట్టు వివరించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు ఇవ్వనున్నట్టు తెలిపారు.
రైతులు, భూ విస్తీర్ణం పెరగడంతో ఈ సీజన్లో రైతుబంధు కోసం రూ.7,720.29 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. గతంతో పోల్చితే ప్రభుత్వంపై సుమారు రూ.300 కోట్ల అదనపు భారం పడుతున్నదని చెప్పారు. ఈ సీజన్‌తో కలిపితే రైతుబంధు ద్వారా రూ.72,910 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్టు అవుతుందని అన్నారు. రైతుబంధు నిధులు విడుదల చేసినందుకు రాష్ట్ర రైతుల తరఫున సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Minister Niranjan Reddy
రైతులకు పెట్టుబడి గోస ఉండొద్దనే లక్ష్యంతో ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను కొనసాగిస్తున్నారని, ఎంత ఖర్చు అయినా రైతు నష్టపోకూడదన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. ప్రభుత్వంపై, కాళేశ్వరంపై కారుకూతలు కూస్తున్న ప్రతిపక్షాలు ఇప్పటికైనా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలని హితవు పలికారు. కాళేశ్వరంతో ఒక ఎకరా సాగులోకి రాలేదని విషం కకిన విపక్షాలు.. బియ్యం సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాసిన లేఖలు చూసి కండ్లు తెరవాలని చురక అంటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సరార్ నినాదం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నదని పేర్కొన్నారు.