వేములవాడ/కేసముద్రం/శాయంపేట, అక్టోబర్ 6: ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపేటకు చెందిన మొగిలి లక్ష్మణ్ (45) వేములవాడలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య జ్యోతి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వేములవాడలో అద్దె వాహనాలతో జీవనోపాధి పొందుతూనే గ్రామంలో ఉన్న ఎకరంలో వ్యవసాయం చేస్తున్నాడు. రెండు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడం, అద్దె వాహనాలు సరిగ్గా నడవకపోవడంతో అప్పులు పెరిగాయి. సోమవారం పొలం వద్దకు వెళ్లిన లక్ష్మణ్ పురుగులమందు తాగి అకడే పడిపోయాడు. కుటుంబ సభ్యు లు లక్ష్మణ్‌ను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు జ్యోతి తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్సై వెంకట్రాజం తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం శివారు పీక్లా తండాకు చెందిన గుగులోత్ భాస్కర్ (40), సరిత దంపతులకు ఇద్దరు కొడుకులు. నారాయణపురం శివారులో 3 ఎకరాలలో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. వ్యవసాయంలో మిగులుబాటు లేకపోవడం, కుటుంబ ఖర్చులు ఎక్కువై ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. పట్టా పాస్‌పుస్తకం లేకపోవడంతో భూమి అమ్ముకునే అవకాశం లేకుండాపోయింది. అప్పులు తీర్చేమార్గం లేక భాస్కర్ ఇంటి ఆవరణలో ఉన్న పశువుల పాకలో ఉరేసుకున్నాడు. సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై క్రాంతికిరణ్ తెలిపారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన నాలికె అనిల్ (29)కు సొంతంగా ఎకరం భూమి ఉండగా, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మూడేళ్లుగా సాగు చేస్తున్నాడు. పెట్టుబడికి సుమారు రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ యేడు వేసిన పత్తి పంట వరుసగా కురిసిన వర్షాలతో దెబ్బతిన్నది. ఈ క్రమంలో పంట పెట్టుబడికి చేసిన అప్పు తీర్చే మార్గం కానరాక, తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 2న ఇంట్లో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అతడి భార్య వీరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.