హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): గత వానకాలంతో పోల్చితే ఈ వానకాలంలో వరి సాగు ఉత్పత్తి తగ్గలేదని వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘పెరిగిందెక్కడ? తగ్గుడే’ శీర్షికన ప్రచురితమైన వార్తకు వివరణ ఇచ్చారు. గత వానకాలం సీజన్లో 65.92 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 144.85 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్టు పేర్కొన్నారు. ఈ వానకాలంలో తుది అంచనాల ప్రకారం 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 156.26 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినట్టు వెల్లడించారు. బియ్యం ఉత్పత్తి గతంలో 97.65 లక్షల టన్నులు ఉండగా, ఈ సీజన్లో 103.61 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్టు వివరించారు.