హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీల) వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. ఏ సొసైటీ ముందు చూసినా చెప్పుల క్యూలు, రైతుల పడిగాపు దృశ్యాలే కనిపిస్తున్నాయి. కానీ, అక్కడ రైతులకు అవసరమైన యూరియా స్టాక్ లేదు. సీన్ కట్ చేస్తే… ప్రైవేటు ఎరువుల షాపుల వద్ద చెప్పుల క్యూ లేదు. బారులు తీరిన రైతులు లేరు. కానీ, అక్కడ అవసరానికి మించి యూరియా ఉన్నా, రైతులకు ఇవ్వడం లేదు. వారికి స్టాక్ లేదని చెప్తున్నారు. లోపల ఉన్న స్టాక్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ దందా చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు అందుబాటులో ఉండే ప్రభుత్వ అనుబంధ సంస్థలైన సొసైటీలతో పోల్చితే, ప్రైవేటు ఎరువుల డీలర్ల వద్ద యూరియా నిల్వలు అధికంగా ఉంటున్నా యి. యూరియా గోల్మాల్ జరుగుతున్నది.
మార్క్‌ఫెడ్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సొసైటీలతో పోల్చితే ప్రైవేటు డీలర్ల వద్దే అధిక యూరియా నిల్వలు ఉన్నాయి. ఈ నెల 23న ప్రైవేటు డీలర్ల వద్ద 18,576 టన్నులు ఉంటే, సొసైటీల వద్ద 12,636 టన్నుల యూరియా మాత్రమే ఉన్నది. ఈ నెల 20న ప్రైవేటు డీలర్ల వద్ద 26,525 టన్నులు, సొసైటీల వద్ద 12,579 టన్నులు ఉన్నది. ఈ నెల 18న ప్రైవేటు డీలర్ల వద్ద 29,549 టన్నులు, సొసైటీల వద్ద 15,622 టన్నుల యూరియా ఉన్నది. మార్క్‌ఫెడ్ వద్ద గల బఫర్‌స్టాక్, గోదాముల్లోని స్టాక్‌తో పోల్చినా అందుకు సమానంగా ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా నిల్వలు ఉండటం గమనార్హం. వాస్తవానికి కోటా ప్రకారం మార్క్‌ఫెడ్‌కు 60%, ప్రైవేటు డీలర్లకు 40% కేటాయింపులుంటాయి. కానీ, తక్కువ కేటాయింపులు ఉన్న ప్రైవేటు డీలర్ల వద్ద ఎక్కువ నిల్వలు ఎక్కువ కేటాయింపులు ఉన్న మార్క్‌ఫెడ్, సొసైటీల వద్ద తక్కువ నిల్వలు ఉండటం గమనార్హం. అధిక కేటాయింపులుండే సొసైటీల వద్ద రైతులు యుద్ధం చేస్తుం టే, ప్రైవేటు డీలర్ల వద్ద విక్రయాల గొడవే లేకపోడం అనుమానాలకు తావిస్తున్నది.
రాష్ర్టానికి వచ్చే ఎరువుల్లో ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు 60%, ప్రైవేటు డీలర్లకు 40% కేటాయిస్తుంది. మార్క్‌ఫెడ్‌కు కేటాయించిన ఎరువులను సదరు సంస్థ వ్యవసాయ శాఖ ఆమోదంతో సొసైటీలకు తరలించి విక్రయిస్తుంది. ప్రైవేటు డీలర్లు.. ఏజెన్సీల ద్వారా విక్రయిస్తారు. కానీ, ప్రభుత్వం మాత్రం వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ఎప్పటి మాదిరిగానే కేటాయిస్తున్నది. దీంతో రైతులు సొసైటీల వద్ద ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రైవేటు డీలర్లు యథేచ్చగా బ్లాక్మార్క్ట్కు తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటుకు కేటాయింపులు నిలిపేసే అధికారం సర్కారుకు ఉన్నప్పటికీ, ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఆవిధంగా చేయడం వల్ల బ్లాక్‌మార్కెట్ దందాను అరికట్టి ప్రైవేటు ఆగడాలకు చెక్ పెట్టడంతోపాటు రైతులకు యూరియా కొరత తీర్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యవసాయ శాఖ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి.
ఎరువుల సరఫరాలో మార్క్ఫెడ్ది కీలక పాత్ర. కానీ, పరిస్థితి చేయిదాటిపోతున్నా.. యూరియా కొరతను తీర్చేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. వాస్తవానికి సొసైటీలకు మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా సరఫరా అవుతుంది. దీంతో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది సదరు అధికారులకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో కొరత తీర్చేందుకు ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు వివరించి సలహాలు, సూచనలు ఇవ్వాలి. కానీ, ఇదంతా మాకెందుకులే అనే విధంగా అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిపై ఒక వ్యవసాయ శాఖ అధికారి స్పందిస్తూ… ‘ఇంత పెద్ద క్రైసిస్‌లో మార్క్‌ఫెడ్ వాళ్లు మొత్తం కోటా ను తమకే కేటాయించాలని అడగాలి. తద్వా రా సొసైటీల ద్వారా రైతులకు ఎక్కువ యూరియాను సరఫరా చేయడమే కాకుండా, అధిక ధరలను, బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ, మార్క్‌ఫెడ్ అధికారులు నిద్రపోతున్నారు. వాళ్లు యూరియా కొరతను సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై మార్క్‌ఫెడ్‌లోని ఒక కీలక అధికారి విచిత్రమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. తమది కేవలం బట్వాడా ఉద్యోగమని, పెద్ద అధికారులు ఏది చెబితే అది చేస్తామని, అనవసరంగా పూసుకోవడం ఎందుకని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కానీ, సమస్యను పరిష్కరించేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. ఈ అంశంలో మార్క్‌ఫెడ్ ఉత్సవ విగ్రహంలా వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు యూరియా కోసం ఇలా గంటల తరబడి వరుసలో నిలబడ లేదు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి రైతులందరూ మోసపోయాం.. ప్రస్తుతం ఘోస పడుతున్నాం.. రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే. ఏనాడు కేసీఆర్ రైతులకు ఇబ్బందులు కలిగించలేదు. నాకు 10 ఎకరాల పొలం ఉంది. నా కొడుకు అనారోగ్యం మూలంగా దవాఖానకు వెళితే యూరియా కోసం నేను వరుసలో నిలబడ్డా. నాకు మోకాళ్ల నొప్పులు.. అందుకే కుర్చీలో కూర్చున్న. ఈ యూరియా వద్దు, ఈ ప్రభుత్వం వద్దు. రేవంత్‌రెడ్డికో దండం..
– గోవిందమ్మ, మహిళా రైతు, గుంటిపల్లి, గద్వాల జిల్లా