Telangana | హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ కంపెనీలకు సంబంధించి ‘అల్లుడా మజాకా’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం వ్యవసాయశాఖలో సోమవారం కలకలం రేపింది. ప్రభుత్వ పెద్దలు, శాఖలోని పలువురు ఉన్నతాధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. ప్రీ యూనిక్ ఇండియా ఆయిల్‌పామ్ కంపెనీ హస్తగతానికి ఓ మంత్రి అల్లుడు, కొడుకు స్కెచ్ వేస్తున్నారు. దాన్ని విక్రయించాలని ఓనర్లను బెదిరింపులకు గురిచేస్తూ ఒత్తిడి చేస్తున్నారు.
రూ.కోట్లలో పెట్టబడి ఇంతకాలం నిర్వహించిన కంపెనీని పంటచేతికొచ్చే సమయానికి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇదే విషయమై ‘అల్లుడా మజాకా’ పేరిట నమస్తే తెలంగాణలో సోమవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో అటు ప్రభుత్వవర్గాలు, ఇటు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు సైతం ఉలిక్కిపడ్డట్టు తెలుస్తున్నది. ఎవరా మంత్రి? ఎవరా అల్లుడు? అని జోరుగా చర్చ కొనసాగుతున్నది. మరోవైపు ఆ కథనంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీసినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా మంత్రి తుమ్మల ఆయిల్‌పామ్ కంపెనీలపై సోమవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించటం గమనార్హం. ఆ సమావేశంలోనూ ‘నమస్తే తెలంగాణ’ కథనంపై అంతర్గతంగా చర్చించుకున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.