హైదరాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ రైతుల నెత్తిన మరో పిడుగు వేయనున్నదా? అందుకే నోటిఫై సన్నరకాల ధాన్యం జాబితాను కుదిస్తున్నదా? ధాన్యానికి ఇచ్చే బోనస్‌ను కూడా ఎగవేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నదా? లేదా ఈ వానకాలం నుంచే పరిమిత సన్నాలకు బోనస్ ఇవ్వనున్నదా? ఇవీ ఇటీవల సన్నాల సాగుపై ప్రభు త్వ ప్రకటనలతో రైతుల్లో రేకెత్తుతున్న అనుమానాలు. ఈ వానకాలం నుంచి 8 రకాల సన్నాలనే సాగు చేయాలన్న వ్యవసాయ శాఖ సూచనలు రైతాంగంలో గుబులు పుట్టిస్తున్నది. దీన్నిబట్టి ప్రస్తుతం బోనస్ ఇస్తున్న సన్నధాన్యం రకాలను కుదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది.ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్త లు, సివిల్ సైప్లె అధికారులు, మిల్లర్లతో సమావేశమై సాగు చేయాల్సిన 8 రకాల సన్నాలను వ్యవసాయ శాఖ గుర్తించింది.
ఈ వానకాలం నుంచి ఇవే రకాలను సాగు చేయాలని రైతులకు సూచించడంతో పాటు ఈ రకపు విత్తనాలనే మార్కెట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ సన్నాల కొనుగోలుకు మంగ ళం పాడి బోనస్‌కు ఎగనామం పెట్టే దిశగా అడుగులు వేస్తున్నదా? అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ శాఖ ప్రకటనతో రైతుల్లో గందరగోళం నెలకొన్నది. జాబితాలో లేని సన్నాలను సాగుచేస్తే బోనస్ ఇవ్వరా? అనే ప్రశ్నలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సర్కార్ నుంచి స్పష్టత కొరవడటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ముందు ధాన్యానికి బోనస్ ఇస్తామ న్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్‌ను సన్నాలకే పరిమితం చేసింది. ఇప్పుడు ఆ సన్నాల బోనస్‌లో కోత విధించి, క్రమక్రమంగా ఆ పథకం నుంచే తప్పుకొనేందుకు సిద్ధమవుతున్నట్టు అర్థమవుతున్నది.
29 రకాలు ఔట్.. మిగిలింది 8 రకాలే
సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్.. ఈ మేరకు సన్నరకాలను నోటిఫై చేసింది. బోనస్‌కు అర్హమైన మొత్తం 37 రకాలను గుర్తిస్తూ 2024 జులై 4వ తేదీన వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా మళ్లీ సన్నాలపై చర్చ మొదలుపెట్టింది. 37 రకాల సన్నాలకు గాను తాజాగా 8 రకాల సన్నాలనే సాగుచేయాలంటూ వ్యవసాయ శాఖ ప్రకటనలు జారీచేస్తున్నది. దాని సారాంశం గత జాబితాలోని మిగిలిన 29 రకాలను సాగు చేయొద్దని చెప్పడమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే 29 రకాలను జాబితా నుంచి తొలగించేందుకు తెరవెనుక చర్యలు చేపడుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 26న ఈ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. మార్చి 27 నుంచి మే 23 వరకు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, సివిల్ సైప్లె అధికారులు, మిల్లర్లతో సమావేశాల అనంతరం రాష్ర్టానికి అనువైన, అధిక దిగుబడిని ఇచ్చే 8 రకాల సన్నాలను గుర్తించనట్టు ప్రకటించిన మంత్రి.. ఆ సన్నరకాలను కూడా ప్రకటించారు. ఈ రకాలను సాగు చేస్తే రైతులకు మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ సూచనలు పాటించాలని రైతులను కోరారు.
ఆ 29 రకాలకు బోనస్ లేనట్టేనా?
తాజా సూచనల ప్రకారం.. 37 రకాల సన్నాలలో కేవలం 8 రకాలనే సాగు చేయాలంటూ సూచిస్తుండటంతో బోనస్‌పై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎనిమిది రకాలకే బోనస్ చెల్లిస్తారా? మిగతా 29 రకాలకు బోనస్ ఇవ్వరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మంత్రి సూచించిన ఆ 8 రకాల్లో డబ్ల్యూజీఎల్44, టీజీసీ 1798 రకాలు వ్యవసాయ శాఖ నోటిఫై చేసిన జాబితాలో లేకపోవడం గమనార్హం.
బోనస్ భారం తప్పించుకోవడానికేనా?
‘ఏరు దాటేదాక ఓడ మల్లన్న, ఏరు దాటాకా బోడి మల్లన్న’ అన్న చందంగా ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తీరు. అధికారం కోసం ఎన్నికల్లో అడ్డగోలు, అలవిగానీ హామీలు గుప్పించిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై చేతులెత్తేస్తున్నది. మెజారిటీ పథకాల అమ ల్లో విఫలమైంది. ఇప్పుడు అరకొరగా అమలు చేస్తున్న హామీలను సైతం బంద్ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇచ్చే బోనస్ కూడా అరకొరగానే ఇస్తున్నదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత యాసంగికి సంబంధించి 4.09 లక్షల మంది రైతులకు రూ.1,159.64 కోట్లు బకాయి పెట్టింది. ఏడాది గడిచినా వారికి బోనస్ బకాయిలు చెల్లించనేలేదు. మొన్నటి వానకాలానికి సంబంధించి రూ.14.62 కోట్లు బకాయి ఉన్నది. తాజా కొనుగోళ్లలో 5 లక్షల టన్నుల సన్నాలను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ.250 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు నయా పైసా చెల్లించలేదు. ఈ చర్యలతో సర్కార్ బోనస్ నుంచి తప్పించుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో వ్యవసాయ శాఖ గుర్తించినసన్నాల జాబితా
తాజాగా సూచించిన 8 రకాల సన్నాలివే