హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు 28 జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు శుక్రవారం ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. 43,304 మంది రైతులు నష్టపోయినట్టు అంచనా వేసింది. ఆ శాఖ అంచనా ప్రకారం.. కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పంటలకు అధికంగా నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాలోనే 77,394 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో 23,169 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 21,276 ఎకరాలు, నిజామాబాద్‌లో 18,417 ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15,317 ఎకరాల చొప్పున పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మంచిర్యాల, ఖమ్మం, నిర్మల్, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల, పెద్దపల్లి, వనపర్తి, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, ములు గు, సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, జగిత్యాల, రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, జనగామ, యాదా ద్రి భువనగిరి జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అన్నిజిల్లాల్లో కలిపి వరి పంట అత్యధికంగా దెబ్బతిన్నట్టు వెల్లడైంది. 1.09 లక్షల ఎకరాల్లో వరి నీట మునిగింది. పత్తి 60 వేల ఎకరాలు, మక్కజొన్న 16 వేలు, వేరుశనగ 20,900 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. సోయా, టమాట, మిర్చి, మినుము, హార్టికల్చర్ పంటలూ పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని ఆ శాఖ తన నివేదికలో తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 1,291 ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం రూ.374.71 కోట్లు అవసరమని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం సమీక్ష అనంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఈఎన్సీ అశోక్ ఈ మేరకు నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వరదకు రోడ్లు తెగి 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, 14 ఊళ్లకు తాతాలిక రాకపోకలను పునరుద్ధరించినట్టు ఈఎన్సీ అశోక్ తెలిపారు. వర్షాలు, వరదలకు ఎకడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడినా వెంటనే పీఆర్ ఈ టోల్‌ఫ్రీ నంబర్ 040-35174352కు సమాచారం అందిస్తే తక్షణం చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. 580 అంగన్వాడీ భవనాలు వర్షాల ప్రభావంతో దెబ్బతిన్నాయని, మరమ్మతులకు రూ.17 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సీఎస్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాన్ని అంచనావేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వరద పరిస్థితులపై ఆరాతీశారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. నష్టం వివరాలను సేకరించాలని సూచించారు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, రెండు రోజుల్లో రాష్ర్టానికి 21,325 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్ మొదటి వారంలో మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రేక్పాయింట్లకు రానున్నట్టు చెప్పారు. అక్కడి నుంచి డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ అగ్నిమాపక శాఖలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అహర్నిశలు కృషి చేశాయని, 48 గంటల్లో 1,646 మందిని రెస్క్యూ చేశామని ఆ శాఖ అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొన్నారు. ఆరు జిల్లాల్లో 31 ప్రధాన ఆపరేషన్లలో 1,646 మంది వరద బాధితులను రక్షించినట్టు తెలిపారు. ఈ రెస్యూ ఆపరేషన్లలో రైతులు, గొర్రెల కాపరులు, విద్యార్థులు, నివాసితులు, అధికారులు, పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, పశువులను కాపాడినట్టు పేరొన్నారు.