ఖైరతాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/వ్యవసాయ యూనివర్సిటీ జనవరి 10 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనాల నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు విద్యార్థి సంఘాలు, ఇటు పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నది. జీవో 55ను రద్దు చేసే వరకూ ఉద్యమిస్తామని మరో విద్యార్థి సంఘం హెచ్చరించింది. మరోవైపు యూనివర్సిటీ పరిధిలో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేసిన పర్యావరణ సంస్థలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
వ్యవసాయ పరిశోధనలకు నిలయంగా ఉన్న యూనివర్సిటీ భూములలో నిర్మాణాలు చేపట్టడం వల్ల అరుదైన వృక్ష జాతులు, జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అగ్రి బయో డైవర్సిటీ పార్క్‌లో జీవ వైవిధ్యానికి పెను ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. మాజీ సీఎం రోశయ్య హయాంలోనే రాజేంద్రనగర్‌లోని అగ్రి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మించిన అగ్రి బయోడైవర్సిటీ పార్కును ప్రారంభించారు. అప్పటినుంచి వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఈ ప్రాంతంలో పరిశోధనలు, అధ్యయనాలతోపాటు, జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చారు. ఈ క్రమంలో ఎంతో అరుదైన జంతు, వృక్ష, జీవ సంపదకు నిలయంగా మారిన పార్కును పరిరక్షించుకోవాలని పర్యావరణవేత్తలు పిలుపునిస్తున్నారు. గడిచిన కొంత కాలంగా ఈ పార్కును అభివృద్ధి చేయడంతోపాటు, ఇక్కడి జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేసిన సంస్థలన్నీ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
యూనివర్సిటీలో 350కి పైగా పక్షులు, జంతుజాతులు, 450కిపైగా వృక్షజాతులు, 80 ఔషధ మొక్కలు, 30 తీగజాతులతో జీవవైవిధ్యం విరాజిల్లుతున్నదని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. వాటన్నింటినీ రక్షిస్తూ బయోడైవర్సిటీ పార్కుగా అభివృద్ధి చేయడంలో 25 ఏండ్ల కృషి ఉందని అన్నారు. భారతదేశంలో అంతరించిపోతున్న ఐదు అరుదైన జాతుల్లో నాలుగు జాతులు ఇక్కడే ఉన్నాయని, సుమారు రెండు లక్షల చెట్లు ఉన్నాయని, ఒక్కో చెట్టు విలువ జీవితకాలం ఇచ్చే ఎకనామిక్ బెనిఫిట్ 35 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌కు ఊపిరితిత్తులు అంటారని, ఇక్కడ వృక్ష సంపద వల్ల హైదరాబాద్, రాజేంద్రనగర్ ఉష్ణోగ్రతల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుందని చెప్పారు.
ఒకప్పడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్న రోశయ్య చేతుల మీదుగా ప్రారంభించిన ప్రేమావతిపేట్లోని అగ్రి బయోడైవర్సిటీ పార్కు.. అదే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరోసారి చేతులు మారుతున్నది. ప్రకృతికి నిలయంగా ఉన్న పదుల ఎకరాల భూముల్లో నిర్మాణ పనులు చేపడితే జంతుజాలం ఆవాసం కోల్పోయే ప్రమాదం ఉందని ఇన్నాళ్లు వ్యవసాయ పంటలతోపాటు, అరుదైన వృక్ష సంపదకు కృషి చేసిన వ్యవసాయ, పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన అతిచిన్న వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్తున్నారు.
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని.. నెల రోజుల్లోనే తన బుద్ధిని బయటపెట్టిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, జీవో 55ను విరమించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థులు ప్రతినబూనారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన నిరసనలు బుధవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. రోజంతా తరగతులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచే వర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. శాస్త్రవేత్తలు, బోధన, బోధనేతర ఉద్యోగులు విద్యార్థులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు.
యూనివర్సిటీ పరిధిలో హైకోర్టు నిర్మించడం వల్ల పర్యావరణం, వ్యవసాయ పరిశోధనలు, తదితర రంగాలకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డికి వ్యవసాయ యూనివర్సిటీ విలువ తెలియకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. నిరసనలో విద్యార్థి సంఘాల నాయకులు రాజ్‌కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీషా, వంశీచందర్‌రెడ్డి, వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.