Niranjan Reddy | కేంద్రం విధానాలతో వ్యవసాయరంగం కుదేలవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి అన్నారు. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఎరువుల సబ్సిడీ గతేడాది బడ్జెట్లో ఫర్టిలైజర్ రివైజ్డ్ ఎస్టిమేట్ రూ.1,71,299 కోట్లు ఉంటే.. ఈ ఏడాది బడ్జెట్ ఎస్టిమేట్ రూ.1,67,887 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఎరువులపై రూ.3,412 కోట్ల సబ్సిడీని తగ్గించారని.. ఇది వ్యవసాయ రంగం, రైతుల మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆహార సబ్సిడీ 2023-24 బడ్జెట్ రూ.2,11,814 కోట్లు ఉంటే.. గత బడ్జెట్లో అతి తక్కువగా రూ.2,05,250 కోట్లకు తగ్గించారన్నారు. ఇప్పుడు దాన్ని రూ.2,03,420 కోట్లకు తగ్గించారని.. ప్రతి సంవత్సరం ఆహార సబ్సిడీని తగ్గిస్తూ పోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందని విమర్శించారు.
ఇది పేదల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. 2025 – 26 బడ్జెట్లో కేంద్రం రాజకీయ అవసరాలనే ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత అభివృద్ధి మీద దృష్టి సారించలేదన్నారు. ఇలాంటి బడ్జెట్‌తో కేంద్రం పదే పదే చెప్పే వికసిత్ భారత్ సాధ్యం అవుతుందా? అంటూ ప్రశ్నించారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న నిర్మలా సీతారామన్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలు మాత్రమే అన్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు. 2024, 2025 ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టారని.. 2026లో యూపీ కోసం, 2027లో గుజరాత్ కోసం బడ్జెట్ ప్రవేశపెడతారా? అంటూ ప్రశ్నించారు.
బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా..? ఇద్దరు కేంద్రమంత్రులు సహా 8 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని నిలదీశారు. కేంద్ర జీడీపీకి 5.1 శాతం కంట్రిబ్యూషన్ ఇస్తున్న తెలంగాణ మరోసారి మోసపోయిందని.. నిధులు రాబట్టడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. రూ.40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖలు రాసి చేతులు దులుపుకున్నారని.. ఏడాదిలో 30 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఏం సాధించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది బీజేపీ, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు మొత్తం ఎనిమిది రూపాయల చొప్పున కేంద్రం తీసుకురాలేకపోయారన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్, బీజేపీల వైపల్యాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.