ఆదిలాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వానాకాలంలో పత్తి, కంది, సోయాబీన్.. యాసంగిలో శనగ, జొన్న, గోధుమ, పల్లి పంటలను సాగు చేస్తున్నారు. అయితే.. ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, పొలాలకు సమీపంలో అడవులు ఉండడంతో పంటలకు పక్షులు, అడవి పందుల బెడద అధికంగా ఉన్నది. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను.. చేతికొచ్చే దశలో పక్షులు, కోతులు, అడవి పందులు నాశనం చేస్తున్నాయి. గుంపులు, గుంపులుగా చేలలోకి వచ్చి పంటలను తినేస్తున్నాయి. అడవిపందుల కారణంగా 20 నుంచి 30 శాతం పంటను రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకునేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. పొలాల్లో పక్షులు, అడవి పందులను బెదరగొట్టడానికి అగ్రికెనాన్ అనే పరికరాన్ని ఆవిష్కరించి అందుబాటులోకి తీసుకొచ్చారు.
రైతులకు ప్రయోజనం
ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు జొన్న చేనులో అగ్రికెనాన్ పరికరాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ పరికరం సత్ఫలితాలు ఇవ్వడంతో రైతులకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వంటగ్యాస్‌తో పనిచేసే ఈ పరికరం ధర రూ.45 వేలు. అగ్రికెనాన్ పరికరాన్ని చేలలో ఒకచోట అమర్చుతారు. ఫిక్స్ చేసిన తర్వాత మనుషులు ఎవరూ లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకోసారి పెద్ద శబ్దం చేస్తుంది. 119 డెసిబెల్ శబ్దం వెలువడటంతో పక్షులు, అడవిపందులు, కోతులు భయంతో చేలలోకి రావు. వంటగ్యాస్ ఉపయోగిస్తుండడంతో వాటికి ఎలాంటి హానీ ఉండదు. ఐదు కిలోల సిలిండర్‌ను పది వేల శబ్దాలు వచ్చే వరకు వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అవగాహన కల్పిస్తాం..
ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన అగ్రికెనాన్ పరికరం మంచి ఫలితాలు ఇస్తున్నది. జొన్న చేలో పరికరాన్ని పెట్టి ప్రయోగాత్మకంగా పరిశీలించాం. శబ్దం కారణంగా పక్షులు, అడవిపందులు చేనులోకి రాలేదు. రైతులకు ఈ పరికరం గురించి అవగాహన కల్పిస్తాం. చేలలోకి పగలు పక్షులు, రాత్రిళ్లు అడవిపందులు రాకుండా ఉపయోగపడుతుంది.
– రాజశేఖర్, వ్యవసాయ శాస్త్రవేత్త, ఆదిలాబాద్ పరిశోధన కేంద్రం