జనగామ, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ పెద్దల నిర్వాకంతో చిల్పూరు బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ మాజీ చైర్మన్, చిన్నపెండ్యాలకు చెందిన సీనియర్ నాయకుడు మామిడాల యాదవరెడ్డి దవాఖాన పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. చిల్పూరు ఆలయ బ్రహోత్సవాల కమిటీ శాశ్వత చైర్మన్‌గా కొనసాగేందుకు యాదవరెడ్డి కాంగ్రెస్ నాయకులతో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఇందిర వర్గానికి చెందిన ఓ నాయకుడు రూ.4 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణ. కాగా ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన వర్గీయుడైన మాజీ ఆలయ చైర్మన్ శ్రీధర్‌రావుకు చిల్పూరు ఆలయ శాశ్వత చైర్మన్ పదవి దక్కింది. ఈ నెల 25న శ్రీధర్‌రావు ప్రమాణస్వీకారం చేశాడు. దీంతో యాదవరెడ్డి ఈ నెల 26న హైబీపీతో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి దవాఖాన పాలయ్యాడు.
ఉస్మానియాయూనివర్సిటీ, నవంబర్ 29: రాష్ట్రంలో పెంచిన గిరిజన రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ రమణ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఎస్టీ కమిషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదుపై శుక్రవారం విచారణ జరిగింది. కమిషన్ సభ్యుడు జే హుస్సేన్ కోర్టులో వాదనలకు సంఘం తరఫున పీవీ రమణ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐఏఎస్ అధికారి శరత్ హాజరయ్యారు. రమణ మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడంతోపాటు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్‌ను నియమించాలని కోరారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వాపోయారు. ప్రభుత్వం తరఫున రిజర్వేషన్లు అమలయ్యేలా కౌంటర్ వేయాలని కోరారు.