ములుగు, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల బంద్ పిలుపు నేపథ్యంలో ములుగులోని ఏజెన్సీ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(నూగూరు), కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండల కేంద్రాలతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను తుదముట్టిస్తున్న సందర్భంగా ఇచ్చిన బంద్ పిలుపుతో వ్యాపారస్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేసి బంద్‌లో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న సమయంలో వ్యాపారస్తులు తమ దుకాణాలను తెరిచి వ్యాపారాలు నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. ప్రైవేటు వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగించారు.
ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి
భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కాంకేర్ జిల్లా చోటే భేతియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీస్ అధికారులకు సమాచారం అందింది. దీంతో జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు మృతిచెందింది.