హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావం తర్వాత చాలామందిలో ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ పెరిగింది. శుభ్రతతోపాటు ఆహారం విషయంలో పోషకాలు అధికంగా ఉన్న వాటిని తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరగా జీర్ణమై, ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల(మిల్లెట్స్) వైపు మొగ్గుతున్నారు. మధుమేహం, ఇతర వ్యాధిగ్రస్తులు కూడా చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలు తినడానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో వీటి వినియోగం క్రమంగా పెరుగుతున్నది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఇక్రిశాట్, శాస్తవేత్తలు కూడా మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివని చెబుతుండటంతో వీటి అమ్మకాలు ఊపందుకొంటున్నాయి. చిరుధాన్యాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.
దీంతో రాబోయే రోజుల్లో చిరుధాన్యాల వినియోగం పెరుగుతుందని గుర్తించిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) మహిళా సంఘాలను చిరుధాన్యాల వ్యాపారంలో ప్రోత్సహించాలని నిర్ణయించింది. చిరుధాన్యాల దుకాణాలు, వాటితో తయారు చేసిన పిండివంటలు, ప్రాసెసింగ్ లాంటివి చేయిస్తున్నారు. చిరుధాన్యాల సాగుకు తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి సరిపోతుంది. పురుగుమందులు, ఫర్టిలైజర్స్ లేకుండా పండించొచ్చు. తక్కువ వర్షపాతం, నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా చిరుధాన్యాలను సులువుగా సాగు చేయొచ్చు.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల సమాఖ్యకు రూర్బన్ మిషన్ కింద చిరుధాన్యాలతో పిండి వంటల తయారీ మిషనరీని అందించారు. వీటితో మిల్లెట్స్ క్లీనింగ్, ప్రాసెసింగ్, బిస్కెట్లు, మురుకులు, రొట్టెలను తయారు చేస్తున్నారు. వీటిలో రొట్టెలు, మురుకులకు అత్యధిక డిమాండ్ ఉన్నది. బిస్కెట్లను కూడా విరివిగా విక్రయిస్తున్నారు. గండీడ్ మండలంలో 200 మంది రైతులను ఎంపిక చేసి ఒక్కొక్కొరికి ఎకరానికి సరిపడా విత్తనాలను తక్కువ ధరకు అందించడంతోపాటు చిరుధాన్యాల సాగుపై పూర్తి అవగాహన కల్పించారు. వారు పండించిన పంటను స్థానిక మహిళా సమాఖ్యనే కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకొన్నారు.
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలో రాగులు సాగు చేస్తున్నారు. వీటిని రైతుల నుంచి కొనుగోలు చేసి క్లీనింగ్ అనంతరం హైదరాబాద్లో హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఆయా గ్రామాల్లో రైతులకు చిరుధాన్యాల విత్తనాలు అందించి పంట పండించాలని, తామే కొనుగోలు చేస్తామంటూ మహిళా సంఘాల సభ్యులు భరోసా కల్పిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ గ్రామంలో మహిళా సంఘ సభ్యులు మహారాష్ర్ట నుంచి చిరుధాన్యాలు తెచ్చి పిండి తయారు చేసి విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు.
మహబూబ్నగర్లో చిరుధాన్యాల దుకాణం పెట్టినం. గిరాకీ పెరుగుతున్నది. జొన్నరొట్టెలు బాగా అమ్ముడుపోతున్నాయి. రోజు 1500 వరకు అమ్ముతున్నం. దాబా లు, హోటళ్లకు కూడా సరఫరా చేస్తున్నాం. నాతోపాటు ఐదారుగురికి పని దొరుకుతున్నది.
– సురేఖ, మహబూబ్నగర్ జిల్లా
చిరుధాన్యాలతో పిండి తయారు చేస్తున్నాం. తొలుత కొందరికి ఉచితంగా కూడా ఇచ్చాం. హైదరాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, వేములవాడలకు సరఫరా చేస్తున్నాం. హైదరాబాద్ ఐటీ కంపెనీలో పనిచేసే వారి నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
– నవకోటి సరిత,
బొప్పాపూర్, సిరిసిల్ల జిల్లా
రూర్బన్ మిషన్ ద్వారా మిల్లెట్స్ మిషన్లు ఇచ్చారు. వీటితో బిస్కెట్లు, మురుకులు, రొట్టెలు తయారు చేస్తున్నాం. 200 మంది రైతులకు మిల్లెట్స్ విత్తనాలను తక్కువ ధరకు ఇచ్చి, వారు పండించిన పంటను కొనుగోలు చేస్తాం. రోజుకు 1500 వరకు రొట్టెలు తయారు చేసి అమ్ముతున్నాం. చిరుధాన్యాల సాగుపై రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నది.
– నవనీత, గండీడ్, మహబూబ్నగర్ జిల్లా