హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రహదారుల స్వరూపమే మారిపోయింది. వాహనదారులకు సింగిల్ లేన్, ఇంటర్మీడియట్ లేన్ బాధలు తగ్గిపోయాయి. డబుల్, నాలుగు, ఆరు లేన్ల రహదారుల నిర్మాణంతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంతో పోలికే లేనివిధంగా స్వరాష్ట్రంలో రోడ్డు కనెక్టవిటీ పెరగడంతో తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వివిధ రహదారుల మొత్తం నిడివి 26,772 కిలోమీటర్లు ఉండగా స్వరాష్ట్రంలో అది 33,074కి.మీకి పెరిగింది. రాష్ట్రం సిద్ధించిన ఎనిమిదేండ్లలోనే వివిధ రహదారుల నిడివి 6,302 కి.మీ పెరగడం విశేషం.
రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత తెలంగాణలో వివిధ రకాల రోడ్ల నిడివి (కిలోమీటర్లలో)

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎమ్మెల్యేలను కలిసేందుకు కనీసం క్యాంపు కార్యాలయాలు ఉండేవి కాదు. ఈ లోటును గుర్తించిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 93 క్యాంపు కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో 33 జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుంండా ఆయా జిల్లా కేంద్రాల్లో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండే విధంగా సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తున్నారు. మొత్తం 29 కలెక్టరేట్లు నిర్మించాలని నిర్ణయించగా, 14 చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 12 పూర్తికావొచ్చాయి. మరో మూడుచోట్ల త్వరలో నిర్మాణం చేపట్టనున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ తీరాన రూ.177.50 కోట్లతో తెలంగాణ అమరవీరుల స్మృతి వనం నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. దీని నిర్మాణ పనులు తుది దశకు చేరుకొన్నాయి.
తెలంగాణ ప్రతిష్టను మరింత ఇనుమడించేలా, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.617 కోట్లతో నూతన సచివాలయం నిర్మిస్తున్నది. వచ్చే దసరానాటికి దీనిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రోడ్లు, భవనాల శాఖ ప్రయత్నిస్తున్నది. అన్ని శాఖల కార్యాలయాలు, హెచ్వోడీలు ఒకేచోట ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు.