ఉమ్మడి రాష్ట్రంలో నిషేధానికి గురైన కల్లుగీత వృత్తికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పునర్వైభవం తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరవడం, ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచడం, చెట్లపన్ను రద్దు, మద్యం దుకాణాల్లో 15శాతం రిజర్వేషన్, నీరాపాలసీ, వంటి కార్యక్రమాలతో గీతకార్మికుల బతుకుల్లో భరోసా నింపారు.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)ః రాష్ర్టాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌కు మద్దతు లభిస్తున్నదని, దేశ ప్రజలు బీఆర్ఎస్ను కోరుకొంటున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిన సీఎం కేసీఆర్‌తోనే దేశవ్యాప్తంగా మార్పు సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. గౌడ సామాజికవర్గానికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలపై ఇతర రాష్ర్టాల గౌడ సంఘాల నేతలు ఆరా తీస్తున్నారని, అనేక సమస్యల పరిష్కారంలో తమ మద్దతు కోరుతున్నారని వివరించారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో గౌడ సామాజికవర్గం సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నిషేధించారు. చాలీచాలని ఎక్స్‌గ్రేషియా, చెట్లపన్ను, కల్లుగీత కార్మికులపై వేధింపులు.. ఇలా అన్నీ మన కండ్ల ముందు ఇంకా కదలాడే దృశ్యాలే. సీఎం కేసీఆర్ వాటన్నింటికీ చరమగీతం పాడుతూ వచ్చారు. గౌడ సామాజిక వర్గం ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారు. హైదరాబాద్‌లో మూసిన కల్లు దుకాణాలు తెరవడం, గీతకార్మికులకు ఎక్స్‌గ్రేషియా రూ.5 లక్షలకు పెంచడం, చెట్లపన్ను శాశ్వతంగా రద్దు, మద్యం దుకాణాల్లో 15శాతం రిజర్వేషన్, కల్లుగీత వృత్తిదారులకే హక్కు ఉండేలా నీరాపాలసీ, అత్యాధునిక హంగులతో నీరాకేఫ్ ఏర్పాటు ఇలా ఎన్నో కార్యక్రమాలతో గౌడ కులస్థుల బతుకుల్లో భరోసా నింపారు. ఆయన నాయకత్వంలో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా నేను పనిచేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా.
ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్. కులవృత్తులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. గౌడ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 70 లక్షల తాటి, ఈత చెట్లు నాటినం. కోకాపేటలో రూ.500 కోట్ల విలువైన భూమిని సర్వాయి పాపన్న ట్రస్ట్‌కు అప్పగించినం. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు చేస్తారు. తెలంగాణతోపాటు యావత్ దేశంలోనూ రైతులు, కులవృత్తుల వారు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారన్న విశ్వాసం నాకు ఉన్నది.
సీఎం కేసీఆర్ ఎంతో దార్శనికత ఉన్న నాయకుడు. క్షేత్రస్థాయిలో పరిస్థితులన్నింటినీ ఆకళింపు చేసుకొని, సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న నాయకుడు. అందుకు తెలంగాణలో జరిగిన అభివృద్ధే ఒక మాడల్. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రావాలని, రైతులకు మేలు చేసే నాయకుడు రావాలని ప్రజలు కోరుకొంటున్నారు. అందుకే సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్కు అన్ని రాష్ర్టాల్లో అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది.
మునుగోడులో అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం.
గౌడ సామాజికవర్గం నుంచి వచ్చిన నాయకుడిగా, అదే శాఖకు మంత్రిగా పనిచేస్తున్న మీతో ఇతర రాష్ర్టాల గౌడసామాజికవర్గం నాయకులు మాట్లాడినప్పుడు ఎలాంటి అభిప్రాయాలు చెప్తున్నారు?
గౌడ కులస్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై ఇతర రాష్ర్టాల నాయకులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కులవృత్తులను బలోపేతం చేసే సీఎం కేసీఆర్ సక్సెస్ మాడల్ తమ రాష్ర్టాల్లోనూ రావాలని కోరుకొంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపే నాయకత్వం జాతీయ స్థాయిలో ఉంటే మరింత మందికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. ఇందుకు కర్ణాటకలోని ఈడిగ కులస్థుల ఆందోళనకు సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను, నన్ను ఆహ్వానించేందుకు బ్రహ్మశ్రీ నారాయణగురు శక్తిపీఠం పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామి, ఇతర నాయకులు వస్తుండటమే ఉదాహరణ. ఇతర రాష్ర్టాల కులసంఘాల నాయకులు కూడా తమ సమస్యల పరిష్కారానికి మా సహకారం కోరుతున్నారు.