MP Lakshman | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయని, అప్పుడు తెలంగాణ ఏక్‌నాథ్‌షిండే ఎవరో తెలుస్తుందని చెప్పారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు వాటిని అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
ఈ నెల 12న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ర్టానికి వస్తున్నారని, ముఖ్యనేతలతో సమావేశం అవుతారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారం, మోదీని రేవంత్ పెద్దన్న అని సంబోధించడం, రాష్ట్రంపై కేంద్రం అపారమైన ప్రేమ కురిపిస్తుండటం.. వంటి పరిణామాల నేపథ్యంలో లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.