Snakes | సుమారు రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలతో తడిసి ముద్దైన ప్రజలకు ఇప్పుడు తదనంతర సమస్యలతో కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. గ్రామాలలో అపరిశుభ్రత కారణంగా విషజ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. హైదరాబాద్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఏ దవాఖానాలో చూసిన జ్వరాలతో బాధపడుతున్న జనమే బారులు తీరుతూ కనిపిస్తున్నారు. జ్వరాలకు తోడు తాజాగా నగరవాసులకు మరో భయం పట్టుకుంది. ఇప్పటికే వీధి కుక్కల వీరవిహారంతో సతమతమవుతున్న జంట నగరవాసులను ఇప్పుడు పాములు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత హైదరాబాద్‌లో పాములు సంచారం అధికమవుతోంది. ఆగస్టు 31 నుంచి ఈనెల 9 దాకా నగరంలో ఓ స్వచ్ఛంద సంస్థ 278 పాములను పట్టుకుందంటే సర్పరాజుల సంచారం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ జనరల్ సెక్రటరీ అవినాశ్ విశ్వనాథన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం రోజుల్లోనే నగరంలోని పలు ప్రాంతాలలో తమ వాలంటీర్లు 278 పాములను రక్షించినట్టు చెప్పారు. ఈనెల 5, 6, 7 తేదీలలో అయితే ఒక్కో రోజు ఏకంగా 45 నుంచి 50 పాములను పట్టుకున్నట్టు చెప్పారు. నగరంలోని సైనిక్‌పురి, అల్మాస్‌గుడ, తిరుమలగిరి, హబ్సిగూడ, అంబర్‌పేట, మల్కాజిగిరి, నాగోల్, నిజాంపేట్, అల్వాల్, హయత్‌నగర్, మీర్పేట్, జూబ్లీహిల్స్ వంటి ఏరియాల నుంచి తమకు ఎక్కువ కాల్స్ వస్తున్నట్టు విశ్వనాథన్ చెప్పారు.
కారణమిదే..
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత గత మూడు నాలుగు రోజులుగా సూర్యుని రాకతో నగర ప్రజలు ఆ వెచ్చటి కిరణాలకు కాస్త స్వాంతన పొందుతున్నారు. మనుష్యుల మాదిరిగానే పాములు కూడా ఎండ వేడిమి కోసం బొరియలు, చెట్ల పొదలు, పాత ఇంటి గోడల నుంచి వెచ్చదనం కోసం బయటకు వస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు తెలిపారు. ‘సూర్యరశ్మి లేనప్పుడు పాములు నిద్రావస్థలో ఉంటాయి. వర్షం కురిసిన తర్వాత సూర్యుడు రాగానే మళ్లీ అవి వెచ్చదనం కోసం వాటి నుంచి బయటకు వస్తాయి’ అని ఆయన అన్నారు. వరదల కారణంగా బొరియల్లోకి నీళ్లు రావడంతో పాములు అక్కడ ఉండటానికి ఇష్టపడవని, డ్రై ఏరియాలలో ఎక్కువ సంచరిస్తాయిని నిపుణులు చెబుతున్నారు. చెట్లు, పడావుబడ్డ ఇండ్ల పక్కన నివాసాలు ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు.