హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ), యూనివర్సిటీ ప్రమాణాలు పాటించిన ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్లు(అనుబంధ కాలేజీలుగా) ఇచ్చేందుకు జేఎన్టీయూ అధికారులు సిద్ధమయ్యారు. విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీలకు ఎట్టి పరిస్థితుల్లో అఫిలియేషన్లు ఇచ్చేది లేదని కళాశాలల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అఫిలియేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూ పరిధిలోని మొత్తం 224 ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో 15 బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి. తనిఖీలకు మే మొదటి వారం వరకు గడువు ఇచ్చినట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కే వెంకటేశ్వర్రావు తెలిపారు. ఆ తర్వాత నివేదికలను పరిశీలించి అఫిలియేషన్ల తుది జాబితా విడుదల చేయనున్నట్టు చెప్పారు.