హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఇల్లీగల్, అన్ ఫెయిర్ ప్రాసిక్యూషన్ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు ఆమె తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. కవితకు మంగళవారం బెయిల్ మంజూరైన అనంతరం ఆయన సుప్రీం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కవితను మార్చి 15న అన్యాయంగా అరెస్టు చేశారని, అన్యాయంగా విచారిస్తున్నారని చెప్తూనే ఉన్నానని, ఇదే విషయాన్ని ఇప్పుడు అత్యున్నత ధర్మాసనం వెల్లడించిందని చెప్పారు. కడిగిన ముత్యంలా బయటకొస్తానని కవిత చెప్పారని, ఇప్పుడు అలాగే బయటకు వచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో కవిత ప్రమేయం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని, కవితపై మోపిన అన్ని అభియోగాలను తిరస్కరించిందని వివరించారు.
ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని, ఎక్కడా నగదు అంశం బయటపడలేదని చెప్పారు. కేవలం కేసీఆర్ బిడ్డ అన్న కక్షతోనే అరెస్టు చేశారని, పార్లమెంట్ ఎన్నిలకు ఒక్కరోజు ముందు అమెను అరెస్టు చేయడం వెనుక మతలబు ఏమిటని, ఎన్నికల ప్రచారానికి వస్తారని భయపడ్డారా? అని ప్రశ్నించారు. విడుదలైన తర్వాత చట్టప్రకారం విచారణకు కవిత సహకరిస్తారని, కోర్టు వాయిదాలకు హాజరవుతారని తెలిపారు.