Gurukula Schools | హైదరాబాద్, ఫిబ్రవరి16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ట్యుటోరియల్స్, గుర్తింపులేని పేరెంట్ సంఘాలు బోగస్ సర్టిఫికెట్లను సృష్టిం చి గురుకుల అడ్మిషన్లను పక్కదారి పట్టిస్తున్నాయని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఈఏడాది అడ్మిషన్లు తగ్గాయని వస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. గురుకులాల్లో ప్రవేశాలకు కుల, ఆదాయ, బోనఫైడ్ సర్టిఫికెట్లు ప్రాథమిక ప్రామాణికమని వివరించారు.
కొన్ని ట్యుటోరియల్స్, గుర్తింపులేని పేరెంట్ సంఘాలు బోగస్ సర్టిఫికెట్లు సృష్టించి.. సీటు ఇప్పిస్తామని రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు అక్రమాలకు పాల్పడ్డాయని పేర్కొన్నారు. అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో బోగస్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్న పలు ట్యుటోరియల్స్ మూతబడ్డాయని తెలిపారు. అలాంటి వారే ఇప్పుడు దరఖాస్తులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అది అవాస్తమని, ఈఏడాది దరఖాస్తులు పెరిగాయని వర్షిణి వెల్లడించారు.