హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి చదువులు పూర్తిచేయించనున్నది. ఇందుకు సెర్ప్, సమగ్రశిక్ష, వయోజన విద్యాశాఖలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ మూడింటి సమన్వయంతో మహిళా సంఘాల సభ్యులను ఓపెన్ స్కూళ్లల్లో చేర్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ప్రవేశాల షెడ్యూల్ విడుదలయ్యింది. 2025-26 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్‌ను ఈ నెల 12న విడుదల చేస్తారు. ఆగస్టు 12 వరకు అప్లికేషన్లు జారీచేస్తారు. నిర్ధేషిత ఫీజు చెల్లించి జూలై 11 వరకు అడ్మిషన్లు పొందవచ్చు. ఆలస్య రుసుముతో జూలై 12 నుంచి ఆగస్టు 12 వరకు అడ్మిషన్లు పొందవచ్చు.
‘ఉపాధ్యాయులను నిరాశపరిచారు’
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు ఉపాధ్యాయ లోకాన్ని నిరాశపరిచాయని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అభిప్రాయపడ్డారు. పెండింగ్ డీఏల విషయంలో సర్కారు పునరాలోచించాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే టీచర్ల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు మార్చాలని సూచించారు. డీఎస్సీ -2003 టీచర్లకు పాత పింఛన్‌ను వర్తింపజేయాలని, మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు, గురుకులాల టైంటేబుల్ మార్పు, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మినిమం టైంస్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.