కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో నానాటికీ తీసికట్టుగా మారాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు, ఆత్మహత్యలు, పాముకాట్లతో గురుకులాలు అంటేనే జంకాల్సిన పరిస్థితి దాపురించింది. ఫలితంగా గురుకుల ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి 10 వేల ప్రవేశాలు తక్కువగా నమోదయ్యాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ హయాంలో దేశానికి తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు.. రేవంత్ సర్కార్ అసమర్థ పాలనతో కుంటుపడి తిరోగమన స్థాయికి పడిపోయాయి. నిండా విద్యార్థులతో కళకళలాడుతూ ఓ వెలుగు వెలిగిన చోట ప్రస్తుతం వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు, పిల్లల మరణాలు కలచివేస్తున్నాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు అనాసక్తి చూపుతున్నారు. నిన్నామొన్నటి దాకా గురుకులాల్లో సీట్ల కోసం పోటీపడ్డ విద్యార్థులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం వచ్చిన దరఖాస్తులే అందుకు నిదర్శనం. నిరుటితో పోల్చితే 10వేలకుపైగా అప్లికేషన్లు తగ్గిపోయాయి. గురుకులాలపై ప్రభుత్వ పర్యవేక్షణలోపం, వరుస దుర్ఘటనలే దరఖాస్తులు తగ్గడానికి ప్రధాన కారణమని అధికారవర్గాలే చెబుతున్నాయి. గురుకుల వ్యవస్థ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతున్నదని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్ష (గురుకుల సెట్) దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. ఫిబ్రవరి 22న రాత పరీక్ష ఉంది. నాలుగు సొసైటీల పరిధిలో 5వ తరగతికి 51,968 సీట్లు అందుబాటులో ఉండగా ప్రవేశం కోసం 79,101మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. బ్యాక్లాగ్ ఖాళీలకు 1,02,960 మంది, మొత్తంగా 1,82,062 మంది మాత్రమే అప్లయ్ చేశారు. నిరుడితో పోల్చితే 5వ తరగతి ప్రవేశ దరఖాస్తులు 10వేలకు పైగా తగ్గాయి. బీఆర్ఎస్ హయాంలో 2023-24 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరించగా 1.34లక్షల మంది అప్లయ్ చేసుకోవడం గమనార్హం. ఒకానొక దశలో 5వ తరగతి ప్రవేశాలకే 1.50మంది వరకు దరఖాస్తు చేసుకున్న పరిస్థితులున్నాయి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చాక గురుకుల ప్రభ మసకబారుతున్నది. యేటికేడు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం బీఆర్ఎస్ హయాంలో విపరీతమైన పోటీ నెలకొనగా, కాంగ్రెస్ రాకతో ప్రవేశాలకు విద్యార్థులు అనాసక్తి చూపుతుండగా, తల్లిదండ్రులు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ రాకతో రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక గురుకులంలో ఫుడ్పాయిజన్ కేసులు, మరణాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. గడిచిన ఏడాది కాలంలోనే దాదాపు 116మంది గురుకుల విద్యార్థులు మృత్యువాతపడినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవి కేవలం ప్రభుత్వం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని ఘటనలు మాత్రమే కావడం గమనార్హం. ఇవేగాక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఫుడ్పాయిజన్ కేసుల్లో దాదాపు 1500మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకుండా పోయిందని విద్యార్థి సంఘాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. దుర్ఘటనలు జరిగిప్పుడు మాత్రమే గురుకులాల ఉన్నతాధికారులు హడావుడి చేయడం, ఓ విచారణ కమిటీ వేయడం, కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్ప నిర్మాణాత్మక చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. గురుకులాలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేని కారణంగా గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు జంకుతున్నారని, అందుకు తాజా దరఖాస్తులే నిదర్శనమని విద్యావేత్తలు, గురుకులు ఉద్యోగులతో పాటు విద్యార్థి సంఘాలు సైతం నొక్కిచెబుతున్నాయి. ఇప్పటికైనా సర్కార్ స్పందించి, నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
5వ తరగతి కంటే బ్యాక్లాగ్ సీట్లకే డిమాండ్ ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే నిరుటితో పోల్చితే ఈసారి దరఖాస్తులు భారీగానే పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతి వరకు 6వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికోసం 1,02,960 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 6వ తరగతిలో ప్రవేశాలకే 48వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. 7, 8 తరగతులకు 20వేల మందికి పైగా, 9వ తరగతి కోసం 13వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. నిరుటితో పోల్చితే బ్యాక్లాగ్ సీట్ల దరఖాస్తులు పెరిగాయి. 2025-26 విద్యాసంవత్సరంలో ఆయా తరగతుల్లో కలిపి మొత్తం 5,461 బ్యాక్లాగ్ సీట్లు ఖాళీ ఉండగా, వాటి కోసం 79,925 మంది విద్యార్థులు నాడు దరఖాస్తు చేసుకున్నారు. నిరుటితో పోల్చితే దాదాపు 20వేల దరఖాస్తులు పెరిగాయి.
