Telangana | హైదరాబాద్, జనవరి13 (నమస్తే తెలంగాణ) : సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయులు, సిబ్బందికి పండుగ మురిపెం లేకుండా పోయింది. పిల్లాపాపలతో గడిపే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా సొసైటీ ఉన్నతాధికారులు సెలవుల్లో గ్రామాల్లోకి వెళ్లి అడ్మిషన్లపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇంటర్‌బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా సీఈవోల్లోని సీనియర్ ఇంటర్ విద్యార్థులకు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తుండటంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లోలోని 5వ తరగతి, అదేవిధంగా 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి, సీఈవో, ఎస్‌వోఈ, సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు కామన్ ఎంట్ర న్స్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తల స్వీకరణ ప్రారం భం కాగా, ఫిబ్రవరి 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 23న రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అంతవరకు బాగానే ఉన్నా సంక్రాంతి సెలవులు ఇవ్వకుండా కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌పై ప్రచారం చేయాలని ఆదేశించడమే ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 2 గ్రామాలను ఎంచుకొని వెళ్లాలని, అక్కడి పంచాయతీ సెక్రటరీని కలిసి టెస్ట్‌పై అవగాహన కల్పించాలని, 10కి తక్కువగాకుం డా ఆడ్మిషన్లను చేయించాలని సిబ్బందికి ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు హుకూం జారీ చేశారు. గ్రామపెద్దను, ప్రజలను కలిసి ప్రచారం చేస్తున్న సమయంలో ఫొటోలను తీసి సొసైటీ గ్రూప్‌లో అప్లోడ్ చేయాలని సిబ్బందిని ఆదేశించడం గమనార్హం. కరపత్రాలను ముద్రించి సిబ్బందికి అందజేయాలని, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా ప్రచారం చేసేలా చూడాలని గురుకుల ప్రిన్సిపాల్స్‌కు సైతం హుకూం జారీ చేశారు.
సంక్రాతి సందర్భంగా ప్రభుత్వం జనవరి 11 నుంచి 17 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఏడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. గురుకుల సొసైటీ పరిధిలోని 38 సీవోఈల్లో సీనియర్ ఇంటర్ విద్యార్థులకు మాత్రం తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదేశాలను ప్రభుత్వ అధికారులే ఉల్లంఘిస్తే పరిస్థితి ఏంటని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు సెలవుల్లో తమకు కొంత ఊరట లేకండా ఉన్నతాధికారులు మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఎస్సీ గురుకుల సొసైటీ ఉపాధ్యాయులు వాపోతున్నారు. కామన్ టెస్ట్‌పై ప్రచారం చేయాలని ఏ సొసైటీలో లేనివిధంగా ఎస్సీ సొసైటీనే ఆదేశించడంపై సిబ్బంది నిప్పులు చెరుగుతున్నారు.