హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించే పలు వస్తువుల కొనుగోళ్లకు నిర్వహించిన టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు. రూ.687.78 కోట్ల టెండర్లో రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందనడం హాస్యాస్పదమని వివరించారు. సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. టెండర్లలో అక్రమాలు జరిగాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండించారు. పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు.
టెక్నికల్ అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఎల్-1 విధానంలోనే టెండర్లు ఖరారు చేశామని, ఏ ఒక సంస్థకూ నామినేషన్ పద్ధతిలో అప్పగించలేదని, గుజరాత్ కాంట్రాక్టర్ కథలు పూర్తిగా కల్పితమని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, లిడ్క్యాప్నకు రెండేళ్లలో రూ.51కోట్ల వర్ ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. దాదాపు 27లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని, ఆరోపణలు మానుకోవాలని సూచించారు.