హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఇన్నాళ్లూ నీరటి, మసూరు, లషర్, షేక్సింధ్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుస్తూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16,758 మంది వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ బుధవారం జరిగింది. హైదరాబాద్లోని సీసీఎల్ఏలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో వీఆర్ఏల జేఏసీ జిల్లా చైర్మన్ల సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మందికి గాను 61 ఏండ్లలోపు వారు 16,758 మంది ఉన్నారు. వీరిలో సర్వీస్ కాలంలో రిమార్క్ ఉన్న వారిని మినహా అందరినీ ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశారు. పదో తరగతి వరకు చదివిన వారికి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఆఫీస్ సబార్డినేట్), ఇంటర్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్, డిగ్రీ, ఆపై విద్యార్హత ఉన్నవారికి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేశారు.
నేడు నియామకపత్రాలు అందజేత!
ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వీఆర్ఏలకు గురువారం నియామక పత్రాలు అందించనున్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం ద్వారా నియామక పత్రాలను అందజేయనున్నారు. తర్వాత వారు తమకు కేటాయించిన విభాగంలో విధుల్లో చేరనున్నారు. ఆ తర్వాత తహసీల్దార్లు తమ పరిధి నుంచి వీఆర్ఏలను రిలీవ్ చేస్తారు. దీంతో సర్దుబాటు ప్రక్రియ పూర్తయి వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోనున్నది.
ఆన్లైన్ పద్ధతిలో అలాట్మెంట్లు: సీసీఎల్ఏ
వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేసేందుకు ఈ నెల 3న రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 2,113 రికార్డ్ అసిస్టెంట్, 679 ఆఫీస్ సబార్డినేట్/చైన్మెన్, పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్, ఇరిగేషన్ శాఖలో 5,073 లష్కర్/హెల్పర్, మిషన్ భగీరథలో 3,372 హెల్పర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆన్లైన్ పద్ధతిలో వీఆర్ఏలను ఆయా శాఖల్లోకి సర్దుబాటు చేసినట్టు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. తమకు ఫలానా శాఖలో ఫలానా పోస్టులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటూ బంధువులకు ఫోన్లు చేసి చెప్పుకుంటూ ఆనందం పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.