హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): నేరపూరిత ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాతాలికంగా జప్తు చేసే అడ్యుడికేటింగ్ అథారిటీలో నిపుణుడైన జ్యుడీషియల్ సభ్యులు ఉండాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. సాధారణంగా జ్యుడీషియల్ సభ్యుడు, సాంకేతిక సభ్యులతో కలిపి ముగ్గురు ఉండాల్సిన ట్రిబ్యునల్లో ఒక సభ్యుడు ఇచ్చే ఉత్తర్వులకు చెల్లుబాటు ఉండదని స్పష్టంచేసింది. సాంకేతిక సభ్యుడితో కూడిన అడ్యుడికేటింగ్ అథారిటీ ధ్రువీకరించిన ఆస్తుల జప్తు ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేసింది. కార్వి గ్రూపు కంపెనీలకు చెందిన రెండు పిటిషన్లు మరో రెండు పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ ఇటీవల తీర్పు చెప్పారు. కార్వి గ్రూపు కంపెనీలు,ఆ సంస్థ చైర్మన్ పార్థసారథి తదితరులకు చెందిన రూ.1,984 కోట్లు, రూ.110 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాల్ చేసిన కేసుల్లో తీర్పు వెలువరించారు. ఈడీ షోకాజ్ నోటీసుల అమలును నిలిపివేశారు. అడ్యుడికేటింగ్ అథారిటీలో నిపుణులైన జ్యుడీషియల్ సభ్యులు లేదంటే ఇద్దరినీ నియమించే దాకా నోటీసులు, జప్తు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.