హైదరాబాద్, ఆగస్టు29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్ల విషయంలో తలెత్తిన స్థానికత వివాదంపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వచ్చేవారం వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు స్థానికత విషయంలో విద్యార్థుల దరఖాస్తులను తిరసరించరాదని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇరుపక్షాల న్యాయవాదులు రాతపూర్వక వాదనలు సమర్పించుకునేందుకు శుక్రవారం వరకు గడువు ఇచ్చింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ రూల్-3 ఏను చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 19న జీవో-33ను జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలవగా సీనియర్ న్యాయవాదులు డీవీ సీతారామ్మూర్తి, మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
సవరణ వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టమని వివరించారు. ఇతర రాష్ట్రాలవారే కాకుండా భారతీయ మూలాలు ఉన్న ప్రవాస భారతీయులు తెలంగాణలో చివరి నాలుగేండ్లు (ఇంటర్, దానికి ముందు రెండేండ్లు) చదివితే స్థానిక కోటా వర్తింపజేయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి నష్టమని చెప్పారు. తెలంగాణలోని వారికే స్థానిక కోటా ఉండాలని విన్నవించారు. ఇకడ చదువుకొన్న వారికి స్థానికత వర్తింపజేయమని కోరడం లేదని చెప్పారు.
ఉద్యోగుల బదిలీ, మెరుగైన విద్య నిమిత్తం ఇంటర్మీడియట్ వేరే రాష్ట్రంలో చదివిన వారికి స్థానికత వర్తించదన్న జీవోను రద్దు చేయాలని కోరారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల పిల్లలకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్తున్న ప్రభుత్వం.. ప్రైవేటు ఉద్యోగుల పిల్లలకు ఇవ్వకపోవడం వివక్షే అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, ఈ జీవో వల్ల తెలంగాణవారికి అన్యాయం జరగదని చెప్పారు. ఏపీకి చెందినవారికి మేలు జరగాలన్న లక్ష్యంతోనే పిటిషన్లు వేశారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం యూనివర్సిటీల పరిధిలోని స్థానిక కోటా రద్దయినందున నిబంధనల సవరణ చేయాల్సి ఉన్నదని వివరించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.