హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నం.234లోని 84 ఎకరాల భూమిపై హైకోర్టు వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌పై వాద ప్రతివాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ గండికోట శ్రీదేవి, జస్టిస్ ప్రియదర్శినిలతో కూడిన ధర్మాసనం శనివారం ప్రకటించింది. ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లకు విచారణార్హతపై ఉత్తర్వులు జారీ చేస్తామన్న హైకోర్టు ఏకంగా ఆ వ్యక్తులకు భూములపై హక్కులున్నాయని తీర్పు చెప్పడం చట్ట వ్యతిరేకమంటూ ప్రభుత్వం రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ, సర్వే 234లోని 84 ఎకరాలు ప్రభుత్వానివేనని చెప్పారు.
కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలతో ఆ భూమి తమదేనని హైకోర్టు నుంచి పొందిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. గత ఏప్రిల్ 22న హైకోర్టు వెలువరించిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరారు. భూములపై బూర్గుల రామకృష్ణ, లింగమయ్య దాఖలు చేసిన రిట్ల విచారణార్హత తేల్చుతామన్న హైకోర్టు ఏకంగా వాళ్ల భూహక్కులపై ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదన్నారు. సీపీసీ 47 సెక్షన్ ప్రకారం, సమీక్ష విషయంలో మూడు దశలు ఉంటాయని, రెండో దశలో ప్రైవేట్ వ్యక్తులు రివ్యూ పిటిషన్లో ఆమోదం పొందారని, ప్రతివాదులకు నోటీసులు అందజేసి వాదనలు విన్న తర్వాతే తీర్పు చెప్పాలన్న న్యాయ నిబంధనలకు విరుద్ధంగా తీర్పు వెలువడిందన్నారు. రిట్లోని ప్రధాన అంశాలపై తీర్పు వెలురించేముందు రాష్ట్రానికి హైకోర్టు రిజిస్ట్రీ నుంచి నోటీసులు ఇవ్వలేదని తప్పుపట్టారు.
ఈ నేపథ్యంలో 84 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులదని చెబుతూ వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువరించడం చెల్లదన్నారు. ప్రభుత్వానికి తగిన అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. ప్రైవేట్ వ్యక్తుల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది అశోక్ ఆనంద్‌లు వాదనలు వినిపిస్తూ, ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించాక దానిపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలేగానీ తిరిగి హైకోర్టుకు రాకూడదన్నారు. హైకోర్టు రిజిస్ట్రీ నోటీసు ఇవ్వాలన్న వాదనను తోసిపుచ్చారు. అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేనప్పుడు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ వాదనను తోసిపుచ్చాలని కోరారు. వాదనల అనంతరం హైకోర్టు తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది.