ఏటూరు నాగారం : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు సమీపంలోని అడవిలో ఆదివాసులు వేసుకున్న గుడిసెలను కూల్చివేసినందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై కత్తులు, కర్రలతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరగబడ్డారు. గుడిసెలను అధికారులు తీసుక వచ్చిన జెసిబి, ట్రాక్టర్లను వెనక్కి పంపించారు. అటవీ శాఖ అధికారుల తీరుపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యూరు గ్రామానికి చెందిన కొంతమంది ఆదివాసులు సమీపంలోని పోడు భూమిలో గత ఏడాది గుడిసెలు వేసుకున్నారు. తరచూ అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెడుతున్నప్పటికి తమకు నివాసానికి గుడిసెలు వేసుకున్నామని చెప్పుకుంటూ వచ్చారు.
కాగా, సోమవారం ఉదయం సుమారు 60 నుంచి 80 మంది అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, 20 మంది పోలీసుల సహాయంతో అక్కడికి వెళ్లి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో ఆదివాసులు అటవీశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి గుడిసెల కూల్చివేతను అడ్డుకున్నారు. జెసిబికి అడ్డుపడ్డారు. కర్రలు, కత్తులతో తిరగబడ్డారు. గుడిసెల కూల్చివేత పాల్పడితే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ ఒకరు పెట్రోల్ మీద పోసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఉద్యోగిపై పెట్రోల్ పడింది. సుమారు రెండు గంటల పాటు అటవీ శాఖ అధికారులు, ఆదివాసీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విధి లేని పరిస్థితిలో అటవీ శాఖ అధికారులు వెనుదిరిగారు.
ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి అడవిని పోడు చేసుకుంటూ నివాసాలు ఏర్పాటు చేసుకుంటే పట్టించుకోని అటవీశాఖ అధికారులు తాము ఉండేందుకు గుడిసెలు వేసుకుంటే ఇబ్బంది పెడుతున్నారంటూ ఆదివాసులు గొల్లుమంటున్నారు. అటవీశాఖ అధికారుల తీరుపై ఉన్నతాధికారులు స్పందించారని తమకు రక్షణ కల్పించాలని గుడిసెలను కూల్చివేసే ప్రయత్నం చేస్తే తాము ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.