ఏటూరునాగారం, జూన్ 16: గుడిసెల కూల్చివేతకు పూనుకున్న అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు భగ్గుమన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూ రు అటవీ ప్రాంతంలో ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను జేసీబీ, డోజర్లతో తొలగించేందుకు ఎఫ్‌డీవో రమేశ్, ఎఫ్ఆర్వోలు అబ్దుల్ రెహమాన్, అప్సరున్సీసా, నరేందర్‌తో పాటు 60 మంది అటవీశాఖ ఉద్యోగులు పోలీసుల సహాయంతో రాగా ఆదివాసీలు అడ్డుకున్నారు. కర్రలు, కత్తులు, కారం చేత పట్టుకుని ఎదురు దాడికి సిద్ధమయ్యారు. జేసీబీ, డోజర్లపై కర్రలతో కొట్టడంతో భయంతో డ్రైవర్లు అక్కడ నుంచి వాహనాలను తీసుకెళ్లారు. ఘర్షణలో డోజర్ డ్రైవర్‌కు నుదిటిపై గాయమైంది.
దీంతో అటవీశాఖ ఉద్యోగులు అక్కడ నుంచి మండల కేంద్రానికి చేరుకున్నారు. ఆదివాసీలంతా ఐటీడీఏ పీవో చిత్రమిశ్రాను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్ర భుత్వం తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నదని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, గుంట భూమిలో గుడిసెలు వేసుకుంటే కూల్చి వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గొత్తికోయలు వచ్చి అడవిని విచక్షణారహితంగా కొట్టి ఇండ్లు నిర్మించుకుంటే పట్టించుకోకుండా తమపై ప్రతాపం చూపుతారా అంటూ మండిపడ్డారు. కాగా, ఈ ఘటనలో గిరిజనులపై పోలీసులు కేసు నమోదు చేశారు.