ఏటూరునాగారం, నవంబర్ 3 : లంబాడీలను ఎస్టీ జాబితానుంచి తొలగించాలని కోరుతూ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీలు సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. వైజంక్షన్లోని కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఐటీడీఏ కార్యాలయం వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై గంటన్నర పాటు ధర్నా చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి 3 వేల మంది ఆదివాసీలు పాల్గొన్నారు.
ఆదివాసీలు, మహిళలు ఐటీడీఏ ఆవరణలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాస్, వైస్ చైర్మన్ వట్టం ఉపేందర్ మాట్లాడుతూ.. లంబాడీలను 1976లో గెజిట్ విడుదల చేయకుండానే ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసీలకు అందాల్సిన రిజర్వేషన్లు వారు పొందుతున్నారని ఆరోపించారు. ఈ నెల 24న ఉట్నూరు, డిసెంబర్ 15న మన్ననూరు, డిసెంబర్ 29న భద్రాచలం ఐటీడీఏ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి, వంటావార్పు చేస్తామని హెచ్చరించారు.