ఆదిలాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): మణిపూర్లో ఆదివాసీ తెగల మధ్య ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చేసిన వ్యాఖ్యలపై ఆ సామాజిక వర్గం మండిపడుతున్నది. ఈ వ్యా ఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు తెరతీశాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ ఇటీవల ఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావల్ను కలిశారు. ఎస్సీ హోదా నుంచి లంబాడాలను తొలగించాలని, తద్వా రా ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 11న సుప్రీంకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశా రు. అయితే బాపురావ్ కేంద్రమంత్రికి విజ్ఞప్తికి విరుద్ధంగా ఒక ప్రధాన పత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) వార్త ప్రచురితమైంది. తాజాగా దానిని ఖండిస్తూ సదరు పత్రికకు లేఖ రాశారు. వార్తను సవరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని, అదే విషయాన్ని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశానని ఎంపీ బాపురావ్ ఆ పత్రికకు సూచించటం గమనార్హం.
భగ్గుమన్న లంబాడాలు
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ చేసిన వ్యాఖ్యలపై లంబాడాలు భగ్గుమంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా లంబాడా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరీంనగర్లో సంఘం నాయకులు ఆందోళన నిర్వహించి.. గిరిజనుల్లో ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఆయన కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలంగాణలో శాంతియుత వాతావరణం లో జీవిస్తున్న గిరిజనుల మధ్య చిచ్చుపెట్టేందుకే ఎంపీ వినతి పత్రం ఇచ్చారని ధ్వజమెత్తారు. సోయం బాపురావ్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని లంబాడా సంఘం నా యకులు డిమాండ్ చేశారు. గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు. బాపూరావ్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏజెన్సీలో ఉద్రిక్తతకు దారి తీస్తున్నది. గతంలో నూ ఇదే రీతిలో ఆదివాసీలు, లంబాడాలకు మధ్య చిచ్చుపెట్టారని లంబాడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, సోయం బాపూరావ్ వినతిపత్రం ఇవ్వటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శ్రీనునాయక్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు.