ఆదిలాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇచ్చోడ: అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) మరోసారి ప్రశంసలు అందుకొన్నది. గ్రామంలో వేలాదిగా నాటిన మొక్కలతో కనుచూపు మేర పచ్చదనం పరుచుకొని కొత్త అందాలను సంతరించుకొన్నది. హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నాటిన మొక్కలను గ్రామస్థులు కంటికిరెప్పలా కాపాడుకొన్నారు. గ్రామ శివారు, ఖాళీ స్థలాల్లో నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. రూ.25 లక్షలతో చేపట్టిన గ్రామ పం చాయతీ ఆవరణలో బృందావనాన్ని తలపించేలా పచ్చని మొక్కలతో తీర్చిదిద్దారు. దీంతో గ్రామం హరిత వనంలా మారింది.
ట్విట్టర్లో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రశంసలు
ముక్రా(కే) గ్రామం, గ్రామ పంచాయతీ భవనాన్ని హరితమయం చేసిన పాలకవర్గాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రశంసించారు. జీపీ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటి, కాపాడుకున్న గ్రామస్థులను అభినందించారు. గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు మంజూరు చేయాలని సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ అభ్యర్థన మేరకు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.