హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ‘ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకోవచ్చని, కేవలం యూట్యూబ్ వీడియోలకు లైకులు కొడితే చాలని అమాయకులను ముగ్గులోకి దించుతున్నారు. అనంతరం కొన్ని లింకులను పంపి, లైకులు కొట్టిస్తున్నారు. ఆపై వారి ఖాతాల్లో కొంత నగదు జమ చేసి, అధిక లాభాల పేరుతో ఎర వేస్తున్నారు. టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి, వాటి ద్వారా టాస్క్‌లు ఇస్తున్నారు.
అనంతరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి నిలువు దోపిడీ చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న టాప్ ట్రెండింగ్ మోసాల్లో పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్ అగ్రస్థానంలో ఉన్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ వెల్లడించారు. ఇలాంటి మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని తెలంగాణ యువతకు సూచిస్తూ ‘ఎక్స్’ వేదికగా ఆమె ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
మోసం ఎలా జరుగుతుందంటే..
పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చూపిస్తామంటూ కేటుగాళ్లు తొలుత సోషల్ మీడియాలో పోస్టు పెడతారు. ఆ లింకును ఎవరైనా క్లిక్ చేసినా, రిైప్లె చేసినా వెంటనే వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లు ఓపెన్ అవుతాయి. తర్వాత రిజిస్ట్రేషన్ కోసం కొన్ని లింకులు పంపి, వాటిలోనే ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. వెంటనే ఆయా కంపెనీల ప్రతినిధులమంటూ కొందరు చాట్‌లోకి వస్తారు. మొదట వారే ఆ అకౌంట్లో కొంత డబ్బులు వేసి నమ్మిస్తారు.
ఆ తర్వాత రూ.100 నుంచి రూ.500 వరకు పెట్టుబడి పెట్టించి, ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ పూర్తిచేస్తే వారి ఆన్లైన్ అకౌంట్లో ఆ డబ్బులకు సంబంధించిన కమీషన్ యాడ్ అవుతుంది. ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకోవాలంటే మరో కొత్త టాస్క్ పూర్తి చేయాల్సిందే. ఇలా రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిస్తారు. కానీ, ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పించకుండా మొత్తం దోచేస్తారు.