హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ఓబీసీలకు ఇప్పటికైనా ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఓబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని 2004 డిసెంబర్ 18న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కేసీఆర్ నేతృత్వంలో ఓబీసీ సంఘాల ప్రతినిధి బృందం కలిసి విన్నవించిందని ఆయన శుక్రవారం ట్విట్టర్లో గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. దురదృష్టవశాత్తు యూపీఏ ప్రభుత్వం ఆ డిమాండ్‌ను నెరవేర్చలేదని, ఎన్డీయే ప్రభుత్వమైనా నెరవేర్చాలని కోరారు. 2023 కేంద్ర బడ్జెట్లో ఓబీసీలకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు.